కడపలో ఏం జరుగుతోంది... జగన్ ఆరా..!
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. కానీ.. గత ఎన్నికల్లో పట్టు కోల్పోయారు.;
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. కానీ.. గత ఎన్నికల్లో పట్టు కోల్పోయారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయాలు భిన్నంగా మారుతున్నాయి. ఒకప్పుడు వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న కడప రాను రాను ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతూ కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసిపి పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో దీనికి కారణాలేంటి అసలు ఏం జరుగుతోంది అన్నది జగన్ ఆరా తీశారు.
అంతర్గతంగా జరిగిన చర్చల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, కలివిడి లేని తనం వంటి వాటిపై ఫిర్యాదులు అనేకం వచ్చాయి. మరీ ముఖ్యంగా మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న నాయకులు మధ్య కలివిడి లేకపోవడం కనిపించింది. అదే విధంగా నియోజకవర్గంపై ఆది నుంచి ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన కారణంగా.. ముఖ్యంగా కొందరి దూకుడుతో తాజాగా ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి కనిపించిందని నాయకులు చెప్పుకొచ్చారు. మరోవైపు కడపలో వైసిపి ప్రభావం ఎంత దిగజారి పోవడానికి కారణం కూడా తాజాగా తెలిసింది.
ఒకరిద్దరు నాయకుల కారణంగానే జిల్లాపై వైసీపీ పట్టు పోతోందన్న విషయం జగన్‌కు తెలిసింది. పైకి పేర్లు చెప్పకపోయినా కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకులు.. కుటుంబాల సహితంగా నియోజకవర్గంపై ఆదిపత్యం ప్రదర్శించారని.. అది తర్వాత కాలంలో జిల్లాకు కూడా విస్తరించిందని అనేక ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అలాంటి వారిని ప్రజలు చీదరించుకున్నారని, ఫలితంగానే వైసిపి దెబ్బతినిందని లెక్కలు తేల్చారు. ఈ వ్యవహారం కొన్నాళ్లుగా పార్టీలో అంతర్గతంగా చర్చ గా నడుస్తోంది.
ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల జాబితాను జగన్ సేకరించారు. వీరిలో ఎవరిని ఉంచాలి? ఎవరిని తీసేయాలి? అనే విషయంపై అంతర్గతంగా జగన్ చర్చిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి 2019 2024 మధ్య పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను ముగ్గురు కీలక నాయకులకు అప్పగించారు. వారిలో ఇద్దరు ఆదిపత్యంతో వ్యవహరించడంతోపాటు అంతా తమ ఇష్టానుసారంగా చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. దీని వల్లే వ్యక్తులతో పాటు పార్టీని కూడా ప్రజలు తిరస్కరించారన్నది నిజమని చెబుతున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.