ఢిల్లీ వేదికగా డీఎస్సీ... పొలిటికల్ టూర్ కి వైసీపీ ప్లాన్ ?
మెగా డీఎస్సీ మీద వైసీపీ ఎక్కడా తగ్గడం లేదు. ఈ విషయంలో అమీ తుమీకి సిద్ధపడుతోంది. తమ వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని అంటోంది.
మెగా డీఎస్సీ మీద వైసీపీ ఎక్కడా తగ్గడం లేదు. ఈ విషయంలో అమీ తుమీకి సిద్ధపడుతోంది. తమ వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని అంటోంది. అందుకోసం కూటమి ప్రభుత్వంతో ఎందాకైనా వెళ్ళి పోరాడుతామని చెబుతోంది. ఈ విషయంలో నిరసనలు చేసిన వైసీపీ విజయవాడలో శాప్ ఆఫీసు వద్ద భారీ ర్యాలీని నిర్వహించింది. ఆ సందర్భంగా దాడులు ప్రతి దాడులతో ఒక రాజకీయ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో పొలిటికల్ కాక టాప్ రేంజికి చేరుకుంది. ఈ విషయం మీద వైసీపీ అధినాయకత్వం నేరుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలసి డీఎస్సీ మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. అంతే కాదు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా ప్రెస్ మీట్ లో వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు.
పక్కా ఆధారాలు అంటూ :
తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని జగన్ చెబుతున్నారు. డీఎస్సీ విషయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవస్థలను వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. అంతే కాదు ఈ ఇష్యూలో స్కాం జరిగింది అనడానికి నాలుగు ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయని జగన్ చెప్పారు. డీఎస్సీ ప్రశ్నపత్రం తయారీ పరీక్ష నిర్వహణ రెండూ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు అప్పగించడంతోనే స్కామ్ ప్రారంభం అయిందని అన్నారు. మొత్తం వ్యవహారం అంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారని అది రెండో తప్పు అని గుర్తు చేశారు. ఇక స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీఓలు ఇచ్చి గతంలో ఉన్న జీఓలు రద్దు చేశారని విమర్శించారు. ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని జగన్ ఫైర్ అయ్యారు. ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు టీడీపీకి చెందిన వారే ఇచ్చి మరీ అనర్హులకు ఉద్యోగాలు అప్పగించారని జగన్ చెప్పారు. ఈ విధంగా మెగా డీఎస్సీలో స్కాం జరిగింది అని తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నామని ఆయన చెబుతూ ఇవే విషయాలను గవర్నర్ దృష్టికి తెచ్చామని చెప్పారు.
పోరాటం ఆగేది లేదు :
ఇదిలా ఉంటే డీఎస్సీ విషయంలో తమ పోరాటం కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు. సీబీఐ విచారణతో పాటు లోకేష్ రాజీనామా రెండూ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అంతవరకూ ఉద్యమిస్తామని చెప్ప్పారు. ఇదిలా ఉంటే గవర్నర్ కి ఈ విషయంలో వైసీపీ ఫిర్యాదు చేయడం అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఏపీ తొలి పౌరుడికి విన్నవించడమే అని అంటున్నారు. అంటే ఈ ఇష్యూ ఇపుడు రాజకీయం నుంచి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కలిసే దిశగా సాగుతోంది అని అంటున్నారు.
ఇక ఇదే జోరుతో ఢిల్లీలో కూడా వైసీపీ ఈ విషయం మీద ఆందోళన చేయాలని వ్యవస్థలలో కీలకమైన వారికి ముఖ్యులను కలసి మెగా డీఎస్సీ మీద ఫిర్యాదు చేయాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. దాంతో డీఎస్సీ పోరు ఇక ఏపీ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అవుతుందా అన్న చర్చ సాగుతోంది. ఈ విషయం మీద జాతీయ స్థాయిలో మీడియా ద్వారా ఫోకస్ పెంచాలని అనుకుంటోంది అంటున్నారు. మరి ఢిల్లీలో వైసీపీ కనుక ఈ ఆందోళన చేస్తే ఎవరెవరిని కలుస్తుంది, ఏ ఏ పార్టీలు మద్దతుగా నిలుస్తాయి అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.