ఇంత ఓటమి వేళలోనూ జగన్ ను వదలని "11"
అయితే.. మారిన రాజకీయం అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్న విషయం వెలువడిన ఫలితాల్ని చూసినప్పుడు అర్థమయ్యే పరిస్థితి.;
పాతకాలం సామెతను ఇక్కడ ప్రస్తావించాల్సిందే. అత్త కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అన్న చందంగా వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఉంది. పార్టీ అధినేత సొంత జిల్లాలో జరిగిన రెండు జెడ్పీ ఉప ఎన్నికల్లో ఓటమి ఒక ఎత్తు అయితే.. అందులోనూ వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి పులివెందుల జెడ్పీ స్థానంలో ఓటమి పాలు కావటం వైసీపీ క్యాడర్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఈ ఎన్నికల ఫలితం తేడా కొడుతుందన్న అనుమానం ఎన్నికల వేళలో వినిపించినా.. వైఎస్ మేజిక్ పని చేస్తుందని.. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివర్లో ఏదోలా బయటపడతామన్నట్లుగా ఉన్నారు.
అయితే.. మారిన రాజకీయం అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్న విషయం వెలువడిన ఫలితాల్ని చూసినప్పుడు అర్థమయ్యే పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో పాటు.. పార్టీ ఎమ్మెల్యేల బలం 11కు తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన 11 ఛేజింగ్ తాజా ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలోనూ కనిపించటం హాట్ టాపిక్ గా మారింది
2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్.. 2024 వచ్చేసరికి..‘151'లోని మధ్యలో ఉన్న ‘5' అంకె మిస్ అయి.. కేవలం పదకొండు స్థానాలకు పరిమితం కావటం తెలిసిందే.
అప్పటి నుంచి పదకొండు అంకె ప్రతి సందర్భంలోనూ వెంటాడటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన ఫలితాల్ని చూసినప్పుడు ‘11' జగన్ ను విడిచిపెట్టలేదన్న విషయం అర్థమవుతుంది. తాజాగా జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు 11 మాత్రమే కావటం గమనార్హం.
అంతేనా.. పులివెందుల స్థానంలో నోటాకు 11 ఓట్లు పడటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నికల నేపథ్యంలో బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా భేటీని సరిగ్గా పదకొండు గంటలకు స్టార్ట్ చేయటం.. ఫలితాలు ప్రతికూలంగా రావటం చర్చనీయాంశంగా మారింది. ఏమైనా.. జగన్ ను అదే పనిగా వెంటడుతున్న పదకొండు మరెంత కాలం వెంటాడుతుందో చూడాలి.