ఆ దేశ మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు
ఇంతకూ ఆయన ఎవరంటే.. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా వ్యవహరించిన యూన్ సుక్ యోల్. తాజాగా ఆ దేశ సియోల్ కోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష వేసింది.;
సెంటిమెంట్ శాపం నుంచి తప్పించుకోవటానికి చాలానే ప్రయత్నం చేసినా.. అతి విశ్వాసంతో అంతులేని అధికారం తన చేతిలోనే ఉంచుకోవాలన్న అత్యాశ.. చివరకు యావజ్జీవ కారాగార శిక్ష పడిన దేశాధ్యక్షుడిగా ఆయన్ను మార్చింది. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో తిరుగుబాటు నేరంపై తీవ్రమైన శిక్షకు గురైన మాజీ దేశాధ్యక్షుడిగా ఆయన నిలిచారు. ఇంతకూ ఆయన ఎవరంటే.. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా వ్యవహరించిన యూన్ సుక్ యోల్. తాజాగా ఆ దేశ సియోల్ కోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష వేసింది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఆయన దాన్ని ఉల్లంఘిస్తూ..సైనిక పాలనకు నిర్ణయం తీసుకోవటం.. తన బలం మీద తాను అమితమైన అతి విశ్వాసాన్ని ప్రదర్శించటం ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.
రాజ్యాంగ విరుద్ధంగా 2024 డిసెంబరులో మార్షల్ లా విధించి.. దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నించిన దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను సియోల్ కోర్టు దోషిగా తేల్చింది. పార్లమెంట్ ను స్తంభింపజేయటానికి.. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీసేందుకు సైన్యాన్ని ఉపయోగించటాన్ని తీవ్రమైన నేరంగాపేర్కొన్న సియోల్ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. నిజానికి ప్రాసిక్యూటర్లు ఆయనకు మరణశిక్ష్ కోరినప్పటికి జీవితఖైదును కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో రక్షణమంత్రి కిమ్ యాంగ్ హ్యున్ కు 30 ఏళ్ల జైలు విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దక్షిణ కొరియాలో దేశాధ్యక్షులు పలువురు ఉరిశిక్షను.. తీవ్రమైన శిక్షల్ని ఎదుర్కొన్న ఘన చరిత్ర ఉంది. దాన్ని తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి.. చివరకు అడ్డంగా బుక్అయిన తీరు ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది.
దక్షిణ కొరియా దేశ చరిత్రను చూస్తే పలువురు దేశాధ్యక్షులు జైలుకు వెళ్లటం.. ఆత్మహత్య చేసుకోవటం.. హత్యకు గురి కావటం.. ఉరిశిక్షతో చనిపోవటమో కనిపిస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి మాజీ అధ్యక్షుడికి ఈ పరిస్థితి కనిపిస్తుంది. యూన్ సుక్ యోల్ కూడా ఆ జాబితాలో చేరారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. దక్షిణ కొరియా దేశాధ్యక్షుడిగా వ్యవహరించే వారికి బ్లూ హౌస్ శాపం వెంటాడుతుందన్న సెంటిమెంట్ ఉంది. ఆ దేశ అధ్యక్షులు తమ అధికార కార్యాలయంగా బ్లూ హౌస్ ను వినియోగిస్తారు. అందులో పని చేసిన వారంతా జైలుపాలు కావటం.. కఠిన శిక్షలకు గురి కావటం.. హత్య.. ఆత్మహత్యతో జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి. అందుకే.. ఆ సెంటిమెంట్ నేపథ్యంలో యూన్ సుక్ యోల్ బ్లూ హౌస్ ను వాడకుండా వాస్తు దోషం పేరుతో తన కార్యాలయాన్ని యోంగ్సాన్ కు మార్చారు. అయినా బ్లూ హౌస్ శాపం నుంచి తప్పించుకోలేకపోయారు.
దేశ ఘన చరిత్ర.. దేశాధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా ఏదో ఒక శిక్షకు గురైన నేపథ్యంలో.. సైనిక పాలన లాంటి తీవ్రమైన నిర్ణయాన్ని యూన్ సుక్ యోల్ ఎందుకు తీసుకున్నారు? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశం కనిపిస్తుంది. యూన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్లమెంట్ లో ప్రతిపక్షానిదే పైచేయి. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం అడ్డుకునేది. ప్రతి బిల్లును అడ్డుకోవటం.. మంత్రులపై అభిశంసన తీర్మానాలు చేయటం.. బడ్జెట్ ను తీవ్రంగా తగ్గించటం లాంటి చర్యలతో తీవ్రమైన అసహనానికి గురయ్యారు. ప్రభుత్వాన్ని నడవనివ్వకుండా చేస్తున్న ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేస్తున్నట్లుగా భావించి.. తనకున్న అపరిమితమైన అధికారంతో ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల హక్కులు.. ప్రజాస్వామ్య ప్రమాణాలకు పాతర వేసే తీవ్రమైన తప్పు చేసి.. అడ్డంగా బుక్ అయ్యారు.
ప్రతిపక్ష నేతల్ని దేశ వ్యతిరేక శక్తులుగా పేర్కొంటూ.. దేశం ప్రమాదంలో ఉందని.. వారిని అణిచివేయకపోతే కొరియా మనుగడ కష్టమని నమ్మినట్లుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ.. దేశంలో మార్షల్ లా విధించారు.దీంతో ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయొచ్చని.. పాలనపై పట్టు విధించొచ్చని భావించారు. ఇదే సమయంలో తన భార్యపై వస్తున్న అవినీతి ఆరోపణలు.. విచారణల ఒత్తిడికి చెక్ పెట్టేందుకు సైన్యాన్ని ఆయుధంగా చేసుకోవాలని భావించారు.
ఆ దేశ గత చరిత్రను వదిలేసి.. తీవ్రమైన తొందరపాటు చర్యకు చేపట్టి.. సైనిక పాలనకు తెర తీశారు.దీనిపై కొరియా ప్రజలు తీవ్రంగా స్పందించటమే కాదు.. పార్లమెంట్ కు భారీగా నిరసనలుచేపట్టారు. ప్రజల్లో పెల్లుబుకిన వ్యతిరేకతను చూసిన సైన్యం దేశాధ్యక్షుడి ఆదేశాల్ని అమలు చేయకుండా ప్రజాస్వామ్య పరిపక్వతను ప్రదర్శించింది. దీంతో.. ఆయన జైలుపాలు కావటమే కాదు.. తాజాగా యావజ్జీవశిక్షకు గురైన పరిస్థితి. వ్యవస్థల్ని నియంత్రించటానికి.. ప్రజల మీద అమితమైన అధికారాన్నిచెలాయించాలన్న అత్యాశ.. చివరకు ఆయన జీవితాన్ని అవమానకర పరిస్థితుల్లోకి నెట్టిందని చెప్పాలి.