ఆఖరి గంట పోలింగ్.. వైసీపీ అనుమానాలపై ఈసీ ఏం చెప్పిందంటే..?

ఈసీ ఆహ్వానం మేరకు ఈసీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు పలు కీలక అంశాలపై తమ అభ్యంతరాలను తెలియజేశారు.;

Update: 2025-07-03 13:01 GMT
ఆఖరి గంట పోలింగ్.. వైసీపీ అనుమానాలపై ఈసీ ఏం చెప్పిందంటే..?

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చివరి గంటపాటు జరిగిన పోలింగ్ పై వైసీపీ లేవనెత్తిన అనుమానాలపై ఈసీ వివరణ ఇచ్చింది. ఆఖరి గంటపాటు పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై తమకు సందేహాలు ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఆ పార్టీ నేతలను ఈసీ ఆహ్వానించింది. దీంతో ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తోపాటు మరికొందరు వైసీపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.

ఈసీ ఆహ్వానం మేరకు ఈసీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు పలు కీలక అంశాలపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఈసీతో భేటీ అనంతరం ఆ వివరాలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో చివరి గంట ఆకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నట్లు ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల్లో నమోదైన ఓట్లకు వీవీ ప్యాట్ల ప్రింట్లకు తేడా ఉన్నదని, వాటిని సరిపోల్చి చూడాలని ఈసీని కోరినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.

ఓటర్ల జాబితా, పోలింగ్ సరళిపైనా చర్చించామని వైసీపీ నేతలు తెలిపారు. ప్రధానంగా గత ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైందని, ఆ తర్వాత జరిగిన పోలింగ్ లో దాదాపు 50 లక్షల ఓట్లు పోలయ్యాయి. దీనిపై విచారణ జరగాలని వైసీపీ కోరుకుంటున్నట్లు చెప్పారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈవీఎం ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులను కంపారిజన్ చేయమని కోరితే, అలా కుదరదని ఈసీ తేల్చేసినట్లు సుబ్బారెడ్డి వివరించారు. పోలింగులో పారదర్శకత లేదని వ్యాఖ్యానించారు. అందుకే వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

బిహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరగా, అందుకు ఈసీ అంగీకరించినట్లు వైసీపీ నేతలు చెప్పారు. రాయచోటిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, హిందుపురంలో 38వ పోలింగు బూత్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఓట్లకు వ్యత్యాసం ఉన్నట్లు ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానమే అమలు అవుతోందని చెప్పారు.

Tags:    

Similar News