వైసీపీ కోటి సంతకాల ఉద్యమం.. నేడు గవర్నర్ ను కలవాల్సిన జగన్ పులివెందులలో..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమం తుస్సుమన్నాదని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.;

Update: 2025-11-25 12:34 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమం తుస్సుమన్నాదని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. తన హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందన్న ఆరోపణలతో జగన్ గత నెల 9న కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రకటించారు. నర్సీపట్నంలో నిర్మాణంలో నిలిచిపోయిన మెడికల్ కాలేజీ భవనాల పరిశీలనకు వెళ్లిన వైసీపీ అధినేత.. అక్కడే కోటి సంతకాల ఉద్యమంపై స్పష్టమైన ప్రకటన చేశారు. అక్టోబరు 10 నుంచి నవంబరు 25 వరకు వివిధ దశల ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆందోళనల్లో చివరి రోజు అయిన నవంబరు 25 మంగళవారం రాష్ట్ర గవర్నర్ నజీర్ ను కలిసి ప్రజల అభ్యంతరాలను తెలియజేస్తామని ప్రకటించారు.

అయితే, ముందుగా చెప్పిన ప్రకారం మెడికల్ కాలేజీలపై తొలి వారం, పది రోజులు ఆందోళనలు చేసిన వైసీసీ.. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని గాలికి వదిలేసిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. నిజానికి జగన్ పిలుపు ప్రకారం నవంబరు 23న నియోజకవర్గాల నుంచి కోటి సంతకాలు చేసిన పేపర్లు జిల్లా కేంద్రాలకు తరలించాల్సివుంది. 24న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి లారీల్లో ఆ పత్రాలు తరలించాలి. 25న అంటే మంగళవారం గవర్నర్ ను కలిసి ప్రజల నిరసనను తెలియజేస్తామని జగన్ గతంలో ప్రకటించారు. జగన్ పిలుపుతో నియోజకవర్గ కేంద్రాల్లో కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కానీ, అధినేత మాత్రం ఎక్కడా, ఎప్పుడూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కాలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక చివరికి గవర్నర్ కు పత్రాలు సమర్పించాల్సిన రోజున ఆ కార్యక్రమం నిర్వహించలేదు. సరి కదా, కోటి సంతకాల ఉద్యమంపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

వైసీపీ ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం గవర్నర్ ను కలుస్తారని అంతా ఎదురుచూశారు. అయితే అధినేత జగన్ ఆ విషయం మరచిపోయారో లేక ఇంకో రోజుకు వాయిదో వేశారో కానీ, ఆయన మంగళవారం పులివెందుల పర్యటనకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో వైసీపీలో ఇతర నాయకులు ఎవరూ కూడా కోటి సంతకాల ఉద్యమంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ఇలాంటి అవరోధాలే ఎదుర్కొంటోంది. కోటి సంతకాలు సేకరించాలని చెప్పిన అధినేత జగన్ నేరుగా ఎక్కడా పాలుపంచుకోగా, కార్యక్రమంపై ప్రకటన చేసిన వెంటనే ఆయన లండన్ ప్లైట్ ఎక్కేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ను కలవాల్సిన రోజు కూడా అదే నిర్లక్ష్యం ప్రదర్శించారని కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లికి తీసుకువస్తామన్న కోటి సంతకాల పేపర్ల ఆచూకీ కూడా కనిపించడం లేదని అంటున్నారు. ఏదో మొక్కుబడి తంతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారే గానీ, సీరియస్ గా తీసుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ రాజకీయంగా సరైన కార్యక్రమం నిర్వహించలేకపోతోందన్న విమర్శలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. 18 నెలల కాలంలో వైసీపీ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా, వాటిలో జగన్ ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. మిర్చి, మామిడి, పొగాకు రైతుల సమస్యలపై జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేసినా అవన్నీ వన్ డే షోగా మిగిలిపోయాయి.మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానించినా, చివరికి ఉద్యమాన్ని నీరుగార్చేశారన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News