చిన్నారి ప్రశ్న.. ఇప్పటికైనా పేరెంట్స్ లో మార్పు వస్తుందా?
సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న హైదరాబాద్‌కు చెందిన లావణ్య అనే వర్కింగ్ మదర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఉద్యోగం చేసే ప్రతి తల్లికీ కెరీర్‌ను, పిల్లలను బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాలే. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న హైదరాబాద్‌కు చెందిన లావణ్య అనే వర్కింగ్ మదర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి కొడుక్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన ఆమెకు, ఆ చిన్నారి అడిగిన ఒక్క ప్రశ్న షాక్ అయ్యేలా చేసింది. ఆ ప్రశ్న ఎందరో తల్లిదండ్రుల కళ్లు తెరిపిస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి.
ఒక చిన్న కోరిక.. ఒక చిన్న పొరపాటు:
లావణ్య వడ్దనం ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ పేరెంటింగ్, లైఫ్ రిలేటెడ్ విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం ఆమె కొడుకు స్కూల్‌కి వెళ్లేముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు. “అమ్మా, నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనిద్దరం కలిసి ఒక గ్రీటింగ్ తయారు చేద్దాం” అని చిన్నారి చెప్పాడు.ఇక దానికి ఆమె సరేనని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. కానీ, సాయంత్రం ఆఫీస్‌లో పని ఎక్కువైపోవడంతో ఆమె అనుకున్న సమయానికి ఇంటికి రాలేకపోయింది.
కొడుకు వేసిన ఆ ఒక్క ప్రశ్న:
ఆఫీస్ పని ముగించుకుని, ఆలస్యంగా కొడుకును తీసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా టైమ్ అయిపోయింది. అయితే, ఎప్పుడూ అల్లరి చేసే కొడుకు ఆ రోజు చాలా సైలెంట్‌గా, మూడీగా ఉండటం లావణ్య గమనించింది. "ఏమైంది నాన్నా? ఎందుకు అలా ఉన్నావు?" అని ప్రేమగా అడిగింది. దానికి ఆ చిన్నారి చాలా మెచ్యూర్డ్‌గా ఒక ప్రశ్న వేశాడు.. "అమ్మా, నీకు నేనెక్కువ? లేక నీ ఆఫీస్ ఎక్కువ?" అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది.
గుండెను పిండేసిన సమాధానం:
ఆ చిన్నారి అడిగిన ప్రశ్నకు లావణ్య వెంటనే తేరుకుని.. "నువ్వే నా ప్రపంచం నాన్నా, నీకంటే ఆఫీస్ ముఖ్యం కాదు" అని గట్టిగా చెప్పింది. దానికి ఆ బాబు "సరే అమ్మ" అని సింపుల్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక బాబు మామూలుగానే వెళ్ళిపోయినా, ఆ ప్రశ్న మాత్రం లావణ్య మనసులో అలానే ఉండిపోయింది. రాత్రి బాబు పడుకునే ముందు ఆమె మళ్లీ ఆ టాపిక్ తీసి, ఆఫీస్ బాధ్యతల వల్ల కొన్నిసార్లు లేట్ అవుతుందని ఎంతో ప్రేమగా వివరించింది.
పిల్లలతో కష్టాలను పంచుకోవాలి:
ఈ అనుభవంతో లావణ్య ఒక గొప్ప విషయాన్ని గ్రహించింది. అదేంటంటే, తల్లిదండ్రులు పడే కష్టాలను, ఆఫీస్ బాధ్యతలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అప్పుడే వాళ్లకు మన పరిస్థితి అర్థమవుతుందని ఆమె లెస్సన్ నేర్చుకుంది. లేదంటే ఆఫీస్ పనుల కోసమే అమ్మానాన్నలు తమను దూరం పెడుతున్నారని పిల్లలు ఫీలయ్యే ప్రమాదం ఉంది. ఇక ఈ విషయాన్ని ఆమె వీడియో రూపంలో పెడితే వేలాది మంది పేరెంట్స్ కనెక్ట్ అయ్యారు.
డబ్బులు సంపాదించడం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడటం ఎంత ముఖ్యమో.. వాళ్లకు మన సమయాన్ని ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. పిల్లలకు మనం కొనిచ్చే ఖరీదైన బొమ్మలకంటే, మన పక్కన ఉండి వాళ్లతో గడిపే కొన్ని క్షణాలే వాళ్లకు కొండంత ఆనందాన్ని ఇస్తాయి. "రోజు చివరిలో పిల్లలకు కావాల్సింది మన ప్రేమ మాత్రమే" అంటూ లావణ్య చెప్పిన మాట అక్షర సత్యం. ఈ స్టోరీ చదివాకైనా ప్రతి ఒక్కరూ పిల్లల కోసం కాస్త సమయాన్ని కేటాయించాలని కోరుకుందాం.