50% సీట్లు పెంపు గ్యారెంటీ.. వచ్చేనెలలోనే మళ్లీ పార్లమెంటు భేటీ?

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తోపాటు పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలో 2011 జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలనే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Update: 2026-05-19 14:30 GMT

మహిళా రిజర్వేషన్, 50 శాతం మేర పార్లమెంటు, అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇప్పటికే ఓ సారి బెడిసికొట్టిన ఈ ప్రతిపాదనను ఈ సారి పక్కాగా అమలు చేయాలని కేంద్ర పెద్దలు పావులు కదుపుతున్నారని అంటున్నారు. గత సారి విపక్షాల అభ్యంతరంతో వీగిపోయిన బిల్లులో మార్పులు చేసి ఏకాభిప్రాయం ద్వారా బిల్లులు ఆమోదించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. గత వారం ఢిల్లీలో పర్యటించిన సీఎం చంద్రబాబును ఈ విషయంలో సహాయం చేయాలని హోంమంత్రి అమిత్ షా అభ్యర్థించారని చెబుతున్నారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తోపాటు పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలో 2011 జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలనే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుతామంటే దక్షిణాది రాష్ట్రాలతోపాటు పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు నష్టపోతాయని విపక్షాలు అడ్డుతగిలాయి. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింకు పెట్టడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్ పడింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం మళ్లీ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చేనెల రెండో వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంచుతామన్న ప్రతిపాదనతో బిల్లు ప్రవేశపెట్టడం, దానిని విపక్షాలు వ్యతిరేకించిన నేపథ్యంలో కొత్తగా బిల్లును మార్చి రాష్ట్రాల వారీగా 50 శాతం సీట్లు పెంచుతామని బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల విపక్షాలకు అభ్యంతరం ఉండకపోవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో విపక్షాలు రాజకీయ కారణాలతో వ్యతిరేకించే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయా పార్టీల నేతలతో సంప్రదించే బాధ్యతను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించినట్లు చెబుతున్నారు.

ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ బిల్లులను ఆమోదించి వీలైనంత త్వరగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం భావిస్తోందని అంటున్నారు. దీంతో ఎటువంటి జాప్యం జరగకుండా చంద్రబాబు సేవలను ఉపయోగించుకోవాలని చూస్తున్న ప్రభుత్వ పెద్దలు, చంద్రబాబు సూచనల మేరకు అఖిలపక్ష సమావేశం నిర్వహణకు సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీంతో కొద్దిరోజుల్లో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుని అఖిలపక్ష సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కేంద్రం భావిస్తోందని చెబుతున్నారు.

కాగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదనపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాల్సివుందని చెబుతున్నారు. బుధవారం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే ప్రధాని త్వరలో అఖిలపక్ష సమావేశం, పార్లమెంటు ప్రత్యేక భేటీపై తేదీలు నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బిల్లులకు సంబంధించి కేబినెట్ నోట్ తయారైందని, ఈ నెలాఖరులోగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి బిల్లులను ఆమోదించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఆగిపోయిందనుకున్న నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడం పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు దారితీస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News