టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌లో ఎటుచూసినా గ్రాండ్‌ ‘ఇండియా’నే..!

టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు నాలుగు.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌.;

Update: 2025-07-14 21:30 GMT

టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు నాలుగు.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌. వీటిలో మిగతా అన్నిటికంటే వింబుల్డన్‌ క్రేజే వేరు..! పచ్చటి కోర్టు.. చుట్టూ హుందాగా అభిమానులు.. సర్రున దూసుకొచ్చే బంతులు.. టెన్నిస్‌ అంటే వింబుల్డన్‌లోనే చూడాలి అనేంతగా ఉంటుంది ఈ గ్రాండ్‌స్లామ్‌. ఆదివారం పురుషుల ఫైనల్స్‌తో ఈ ఏడాది వింబుల్డన్‌ ముగిసింది. శనివారం మహిళల సింగిల్స్‌ ఫైనల్లో స్వైటెక్‌ విజయం సాధించగా, ఆదివారం పురుషున ఫైనల్లో టాప్‌సీడ్‌ యానిక్‌ సినర్‌ గెలుపొందారు. ఈ ఏడాది వింబుల్డన్‌ ప్రత్యేకత ఏమంటే.. స్వియాటెక్‌ కొత్త చాంపియన్‌ కాగా.. వింబుల్డన్‌ గెలవడమూ సినర్‌కు ఇదే తొలిసారి. అంటే.. మహిళల, పురుషుల విభాగాల్లో కొత్త చాంపియన్‌లను చూశాం అన్నమాట. ఇక టెన్నిస్‌ అభిమానులు ఈ ఏడాది చివరిదైన గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అమెరికాలో సెప్టెంబరులో ఈ టోర్నీ జరుగుతుంది.

ఈ తరానికి ఎవరో రారాజు..?

మొన్నటివరకు పురుషుల టెన్నిస్‌లో రారాజు అల్కరాజ్‌ అని భావించారు. 22 ఏళ్ల ఈ స్పెయిన్‌ యువకుడు తన ఆటతో టెన్నిస్‌ ప్రపంచాన్ని అంతగా ముగ్ధుడిని చేశాడు. 22 ఏళ్లకే ఐదు టైటిల్స్‌ కొట్టాడు. అయితే, అల‍్కరాజ్‌కు తానేమీ తక్కువ తినలేదని చాటుతున్నాడు సినర్‌. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అల్కరాజ్‌ చేతిలో ఓటమికి ఆదివారం వింబుల్డన్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు ఈ ఇటలీ కుర్రాడు. దీంతో సినర్‌ ఖాతాలో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ చేరింది. పీట్‌ సంప్రాస్‌-ఆండ్రీ అగస్సీ, రోజర్‌ ఫెడరర్‌-రఫెల్‌ నాదల్‌ తరహాలో వీరిద్దరూ వచ్చే పదేళ్ల పాటు టెన్నిస్‌ ప్రపంచంలో హోరాహోరీగా పోటీ పడడం ఖాయం అని తెలుస్తోంది.

గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌లో భారత్‌ ఉనికి హైదరాబాదీ సానియా మీర్జాతోనే కనుమరుగైందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి, సానియా మీర్జా ఒక దశలో అద్భుత విజయాలతో ప్రపంచ టెన్నిస్‌లో భారత పతాకాన్ని ఎగురవేశారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఎదిగే ఆటగాళ్లు కనిపించడం లేదు. కానీ, మరో విధంగా గ్రాండ్‌స్లామ్‌లో మేకిన్‌ ఇండియా ఉనికి కనిపిస్తోంది. అదెలాగంటే.. తువాళ్ల ద్వారా (టవల్స్‌). మన దేశంలో తయారైన ఈ టవళ్లను వింబుల్డన్‌లో వినియోగించారు. టెన్నిస్‌లో టవళ్ల పాత్ర చాలా కీలకం అనే సంగతి తెలిసిందే. ఆటగాళ్లతో సమానంగా ఈ టవళ్లు కనిపిస్తుంటాయి. ఇలా వింబుల్డన్‌లో వాడిన టవళ్లను ఆటగాళ్లు కూడా చాలా ఇష్టపడ్డారట. ప్రముఖ క్రీడాకారులందరూ ఎంతో ఇష్టంగా వీటిని ఇంటికి తీసుకెళ్లారట. మ్యాచ్‌లో చెమటను తుడుచుకునేందుకు వాడే టవళ్లు ఆటగాళ్లకు చాలా సౌకర్యంగా ఉన్నాయట. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వేసవి కావడంతో చెమట పడుతుంది. దానిని తుడుచుకునేందుకు మేకిన్‌ ఇండియా టవళ్లు బాగా పనికొచ్చాయని టాక్‌.

Tags:    

Similar News