ఇండిగో కొత్త రథసారధి.. ప్లానింగ్ పెద్దదే

దేశంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే విమానయాన సంస్థగా ఇండిగో సుపరిచితం. తాజాగా తన కొత్త సీఈవోకు సంబంధించిన ప్రకటనను జారీ చేసింది.;

Update: 2026-04-01 14:30 GMT

దేశంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే విమానయాన సంస్థగా ఇండిగో సుపరిచితం. తాజాగా తన కొత్త సీఈవోకు సంబంధించిన ప్రకటనను జారీ చేసింది. విమానయాన రంగంలో నిపుణుడిగా.. ఇప్పటికే పలు విజయాల్ని తన ఖాతాలో వేసుకొని.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న విలియం విల్లీ వాల్ష్ ను తన తదుపరి సీఈవోగా ఎంపిక చేసింది. ఈ ఏడాది ఆగస్టు మూడున ఆయన తన బాధ్యతల్ని చేపట్టనున్నారు. ప్రస్తుతం విలియం వాల్ష్ అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్నారు. ఆ పొజిషన్ లో ఆయన జులై 31 వరకు పని చేయనున్నారు. ఆ పదవి నుంచి వైదొలిగిన మూడు రోజుల తర్వాత ఇండిగో సీఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇంతకీ విలియం వాల్ష్ ఎక్కడి వాడు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇండిగో ఆయన్నే ఎంపిక చేసుకోవటానికి కారణం ఏమిటి? ఆయన పని తీరు ఎలా ఉంటుంది? పాత సీఈవోకు.. కొత్త సీఈవోకు తేడా ఏంటి? తన భవిష్యత్తు అవసరాలు.. వ్యాపారాలకు తగ్గట్లుగా విలియం వాల్ష్ ను ఎంపిక చేశారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఐర్లాండ్ జాతీయుడైన విలియం వాల్ష్ 1961లో డబ్లిన్ లో జన్మించారు. ఆయన కెరీర్ ను చూస్తే ఆసక్తికర అంశం ఒకటి కనిపిస్తుంది.

1979లో ఏర్ లింగస్ అనే విమానయాన సంస్థలో కేడెట్ పైలట్ గా కెరీర్ షురూ చేసి.. చివరకు అదే సంస్థకు సీఈవోగా ఎదిగిన తీరు ఆయన సొంతం. అంతేకాదు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏర్ లింగస్ సంస్థను లాభాల బాట పట్టించిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. అంతేకాదు బ్రిటిష్ ఎయిర్ వేస్.. ఐబీరియా విలీనానికి సంబంధించి లీడ్ తీసుకొని.. ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన గ్రూపుల్లో ఒకటైన ఐఏజీ (ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ గ్రూప్)ను స్థాపించారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ డైరెక్టర్ జనరల్ గా ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన రంగ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు.

గత ఏడాది చివర్లో ఇండిగో భారీ ఎత్తున విమాన సర్వీసులను రద్దు చేయటం.. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న సంక్షోభంతో ఇండిగో ఇమేజ్ కు తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. సంస్థను గాడిలో పెట్టేందుకు.. ఆ తరహా సంక్షోభాలు రిపీట్ కాకుండా చూసుకోవటంతో పాటు.. అంతర్జాతీయంగా విస్తరించేందుకు వీలుగా వాల్ష్ అనుభవాల్ని ఇండిగో వాడుకోవాలని భావిస్తోంది. అందుకే తాజా మాజీ సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసినంతనే ఆయన స్థానంలో విలియం వాల్ష్ ను ఎంపిక చేసింది. విలియం వాల్ష్ విషయానికి వస్తే.. ఆయన్ను విమానయాన రంగంలో అత్యంత కఠినమైన.. శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా చెబుతారు. విమానయాన సంస్థల నిర్వాహణలో అనవసర ఖర్చులు తగ్గించటంతో పాటు ఆర్థిక క్రమశిక్షణను పాటించటంలో మంచి పేరుంది.2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం లాంటి కష్టకాలంలో సంస్థలను సమర్థంగా నడిపించిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.

ప్రస్తుతం ఇండిగో అంతర్జాతీయ మార్కెట్ లోకి భారీగా విస్తరించాలని చూస్తోంది. వాల్ష్ కు ఉన్న గ్లోబల్ నెట్ వర్కుతో ఇది మరింత సులువు అవుతుంది. ఆయనకున్న అపార అనుభవం సంస్థకు మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇండిగో కొత్తగా వైడ్ బాడీ విమానాలకు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాటిని నిర్వహించటంతో వాల్ష్ కు మంచి పట్టు ఉంది. ఇక్కడే వాల్ష్ కెరీర్ లోనే అత్యంత కీలకమైన.. ఘన విజయాన్ని ప్రస్తావించాలి. నిజానికి ఇదే ఆయనకు గ్లోబల్ స్థాయిలో మంచి పేరు వచ్చేలా చేసింది.

2001లో ఏర్ లింగస్ విమానయాన సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆ సంస్థ దివాలా తీసే స్థితిలో ఉంది. సెప్టెంబరు 11 దాడుల తర్వాత ప్రపంచ విమానయాన రంగం ఎదుర్కొన్న సంక్షోభం ఏర్ లింగస్ మీదా పడింది. దీంతో.. ఆయన తనదైనమోడల్ ను ఆవిష్కరించారు. అప్పటివరకు ఏర్ లింగస్ ఒక సంప్రదాయ విమానయాన సంస్థగా ఉంటే..దాన్ని తక్కువ ధరల విమానయాన సంస్థగా మార్చేయటంతో పాటు.. సంస్థ ప్రత్యర్థి రయనైర్ పని తీరులోని కొన్ని మంచి అంశాల్ని యథాతధంగా తన ఎయిర్ లైన్స్ లోనూ వాడేశారు. సంస్థ మనుగడ కోసం భారీగా ఖర్చుల్లో కోత వేసిన ఆయన.. మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మొత్తం సిబ్బందిలో దాదాపుమూడో వంతు కంటే ఎక్కువ మంది సిబ్బందిని తొలగించారు. సుమారు 2వేల నుంచి 2500 మంది ఉద్యోగులపై వేటు వేయటం ద్వారా ఖర్చును తగ్గించేశారు.

అదే సమయంలో కేటరింగ్.. క్లీనింగ్ లాంటి సేవల్ని ఔట్ సోర్సింగ్ కు ఇవ్వటం ద్వారా నిర్వహణ బిల్లును తగ్గించారు. అంతేకాదు.. ప్రయాణ టికెట్ ధరల్ని 37.5 శాతం తగ్గించటం.. ఆన్ లైన్ ద్వారా టికెట్ల అమ్మకాల్ని ప్రోత్సహించటం ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఖర్చుల్ని 60 శాతం తగ్గించటంతో పాటు తక్కువ వ్యవధిలో ఉండే ప్రయాణాల్లో బిజినెస్క్లాస్ ను రద్దు చేయటం.. ఫ్రీ మీల్ కు కోత పెట్టటం ద్వారా సంస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అతడి మార్పులకు తగ్గట్లే సంస్థ పని తీరులోనూ మార్పు వచ్చాయి.దీంతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 140 మిలియన్ యూరోల నష్టాల్లో ఉన్న సంస్థ కాస్తా ఏకంగా 69 మిలియన్ యూరోల నికర లాభాన్ని ఆర్జించేలా సంస్థను మారచారు. అతడి కెరీర్ లో ఇదో అతి పెద్ద విజయం. ఇదే ఆయనకు అంతర్జాతీయంగా మంచి పేరును తీసుకొచ్చింది.

ఇండిగో మాజీ సీఈవో పీటర్ ఎల్బర్స్ శైలి మ్రదువుగా.. వ్యూహాత్మకంగా ఉంటే.. విలియం వాల్ష్ వ్యవహారశైలి అత్యంత కఠినంగా.. నిష్కర్షగా ఉంటుందని చెబుతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం.. ఖర్చుల్లోకోత.. క్రమశిక్షణ పాటించే విషయంలో వ్యవహరించే శైలి భిన్నమని చెబుతారు.దీనికి తోడు ఇండిగోను ఒక బడ్జెట్ ఎయిర్ లైన్ స్థాయి నుంచి గ్లోబల్ ప్లేయర్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఆయన ఎంపిక సరైనదన్న మాట వినిపిస్తోంది. ఇండిగో వద్ద ప్రస్తుతం 427 విమానాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో తన తొలి ఎయిర్ బస్ ఏ350-900ను డెలివరీ చేసుకోనుంది. ఈ రకానికి చెందిన 60 విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన ఇండిగో.. మరో 40 ఇదే తరహా విమానాలను కొనుగోలు చేసే హక్కును కలిగి ఉంది. ఇండిగో ఫ్యూచర్ ప్లాన్ కు తగ్గట్లే.. తాజా నియామకం జరిగినట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News