బాలయ్య మంత్రి కాదు..మరి ?

అలా పాతికేళ్ల క్రితం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే కనుక బాలయ్యకు మంత్రి ఏమిటి ఆయనే సీఎం అని అభిమాన గణం ఉవ్వెత్తిన ఊగిన సందర్భాలు కనిపిస్తాయి.;

Update: 2025-10-14 03:59 GMT

నందమూరి బాలక్రిష్ణ. ఆ ఇంటి పేరులోనే వైబ్రేషన్ ఉంది. అన్న గారి వారసుడు, సినీ రంగంలో తండ్రికి తగిన తనయుడు. తండ్రి కంటే ఎక్కువ కాలం సినీ సీమను ఏలిన వారు. అంతే కాదు తండ్రికి సరిసాటిగా పౌరాణిక చారిత్రాత్మక జానపద చిత్రాలలో నటించి మెప్పించిన కధానాయకుడు. అయితే ఎన్టీఆర్ కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు, రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటారు, మూడు సార్లు సీఎం గా పనిచేశారు. మరి బాలయ్య కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా కాలేదు, తాజాగా చూస్తే బాలయ్య మంత్రి కావాలని అభిమానుల నుంచి డిమాండ్ వచ్చింది. దానికి బాలయ్య నవ్వి ఊరుకున్నారని అంటున్నారు.

ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే :

అలా పాతికేళ్ల క్రితం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే కనుక బాలయ్యకు మంత్రి ఏమిటి ఆయనే సీఎం అని అభిమాన గణం ఉవ్వెత్తిన ఊగిన సందర్భాలు కనిపిస్తాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బ్యాక్ టూ బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి అప్పట్లో బాలయ్య నామస్మరణతో టాలీవుడ్ తరించింది. ఆయన ఇమేజ్ కూడా ఒక్కసారిగా మిన్నంటింది. నరసింహ నాయుడు చిత్రం వంద రోజుల వేడుక హైదరాబాద్ లో జరిగినపుడు ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా సభకు హాజరయ్యారు. అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్ పూనకాలు మాటల్లో చెప్పాల్సినది లేదు, సీఎం బాలయ్య సీఎం బాలయ్య అని హోరెత్తించేశారు. సభ సాగుతున్నంత సేపూ అవే నినాదాలు అవే జోరుతో సాగాయి. వేదిక మీద సీఎం గా చంద్రబాబు ఉండగానే బాలయ్య సీఎం అంటూ స్లొగన్స్ ఆపకుండా చేసిన ఘనత ఆయన ఫ్యాన్స్ ది. అంతలా బాలయ్య స్టార్ డం నడిచింది ఆ రోజుల్లో.

వియ్యంకులుగా బంధం :

ఇలా సాగుతున్న టైం లోనే వియ్యకులుగా బాలయ్య చంద్రబాబు మారారు. ఆ తరువాత టీడీపీ పరాజయాలు ఇబ్బందులు ఇవన్నీ జరిగిపోయాయి. తిరిగి టీడీపీ 2014లో అధికారంలోకి విభజన ఏపీలో వచ్చింది బాలయ్య కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. విభజన ఏపీలో బాలయ్య మంత్రి అంటూ అప్పట్లోనే ఫ్యాన్స్ నినాదాలు చేశారు కానీ జరగలేదు, ఏ సభలోనూ మెంబర్ కానీ నారా లోకేష్ 2017లో కీలక శాఖలతో మంత్రి అయ్యారు కానీ బాలయ్య ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. 2019లో టీడీపీ ఓడినా బాలయ్య గెలిచారు. ఇక 2024లో మరోసారి టీడీపీ గెలిచింది కానీ బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా చాన్స్ దక్కలేదు, ఇలా బాలయ్య ఎమ్మెల్యేగానే ముందుకు సాగుతున్నారు.

రాజకీయాల్లో అంతే :

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే రాజకీయాల్లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు, కాల మహిమ ఉంటుంది. సమీకరణలు ఉంటాయి. అందుకే సీఎం బాలయ్య అన్న స్లొగన్స్ నుంచి బాలయ్య మంత్రి కావాలి అని ఆయన కారుకు అడ్డం పడుతూ అభిమానులు అడిగే వరకూ కధ సాగింది మరి బాలయ్య మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. బాలయ్య సినీ రంగంలో టాప్ హీరో. తండ్రి స్థానాన్ని భర్తీ చేశారు. రాజకీయాల్లో కూడా ఆయన కీలక స్థానమే కోరుకోవాలి. అభిమానులూ అదే ఆశించారు. కానీ ఇపుడు మంత్రి అయినా చాలు అంటున్నారు. మరి బాలయ్య మంత్రి అవుతారా లేక ఇంకా ఏమైనా అవుతారా అంటే కాలమే చెప్పాలి. ఒక్క మాట అయితే ఉంది. ఎమ్మెల్యేగా ఉండడంలోనే బాలయ్యకు కూడా బాగుంది అని అంటారు. మంత్రి అయితే ఇంతేనా అనుకుంటారు. సీఎం పదవి అంటే అది రాజకీయ సిరి ఉండాలి. సో అన్నీ తెలిసిన వారుగా బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ ని విని నవ్వుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News