మా ట్రంప్ కే ఇవ్వరా.. నోబెల్ కమిటీపై వైట్ హౌస్ కారాలు మిరియాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై వైట్ హౌస్ తీవ్ర అసంతృప్తిని, విమర్శలను వ్యక్తం చేసింది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై వైట్ హౌస్ తీవ్ర అసంతృప్తిని, విమర్శలను వ్యక్తం చేసింది. ఈ ఏడాది పురస్కారాన్ని వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించింది.
రాజకీయ వివక్ష: వైట్ హౌస్ విమర్శలు
వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుయెంగ్ 'X' వేదికగా ఈ విషయంలో నోబెల్ కమిటీపై కారాలు మిరియాలు నూరారు. "నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కనబెట్టి రాజకీయ వివక్షను ప్రదర్శించింది," అని ఆయన ఆరోపించారు.
అయినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ తన ప్రయత్నాలను కొనసాగిస్తారని చుయెంగ్ స్పష్టం చేశారు. "అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడతారు. ఆయన మానవతావాది. తన సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించే ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండరు," అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ అనుకూల వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి.
నెరవేరని కల: ట్రంప్ ఆకాంక్ష
నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష చాలా కాలంగా ఉంది. గతంలో అనేక సార్లు ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, తనకు నోబెల్ వచ్చి తీరాలనే స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఎన్నో యుద్ధాలను ఆపానని, ప్రపంచ శాంతిని కోరుకుంటున్న తనకు ఈ పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. తాను ఎన్ని మంచి పనులు చేసినా... నోబెల్ మాత్రం ఇవ్వరంటూ గతంలో ఓ సందర్భంలో తన అక్కసును కూడా వెళ్లగక్కారు.
అయితే, ఈసారి నోబెల్ అకాడమీ వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోను ఎంపిక చేయడంతో, అమెరికాలో రాజకీయ చర్చ మళ్లీ ట్రంప్ చుట్టే తిరిగింది. బహుమతి చుట్టూ రాజకీయ రగడ మళ్లీ రగిలింది.
ఇక ట్రంప్ అనుచరులు కూడా సోషల్ మీడియాలో నోబెల్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “ట్రంప్ లేకుంటే మధ్యప్రాచ్యం మళ్లీ యుద్ధాల మంటల్లో కాలిపోయేది. అయినా కమిటీ కళ్ళు మూసుకుంది” అంటూ వాదిస్తున్నారు.
అయితే నోబెల్ కమిటీ తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ “మచాడో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిర్భయంగా పోరాడారు. ఆమె కృషి ప్రపంచానికి ప్రేరణ” అని పేర్కొంది.