భారీ త్రిశూలం ఢమరుకం...అక్కడ ఆధ్యాత్మిక అనుభూతి
విశాఖలో అనేక చోట్ల ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రదేశాలు ఉన్నాయి.;
విశాఖలో అనేక చోట్ల ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. రుషికొండ మీద రుషులు తపస్సు చేసుకునేవారు అని చెబుతారు. అదే విధంగా తొట్లకొండ బావి కొండ అన్నవి విశాఖ బీచ్ రోడ్డులో మూడు వేల క్రితం నాటి బౌద్ధ మత ఆనవాళ్లుగా ఈ రోజుకీ కనిపిస్తాయి. ఇక విశాఖ సాగర తీరం వద్ద ఉన్న కైలాసగిరి సాక్షాత్తూ పరమశివుడు పార్వతీ స్వరూపాలకు నిలయంగా పేర్కొంటారు. దాంతో ఇక్కడ ఎత్తైన శివ పార్వతుల విగ్రహాలను దశాబ్దాల క్రితమే ప్రతిష్టించారు. ఇపుడు దానికి సరికొత్త హంగుగా భారీ త్రిశూలం ఢమరుకం లను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. దాంతో కైలాసగిరి ఇపుడు ఆధ్యాత్మిక ప్రభలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.
ఆరు కోట్ల వ్యయంతో :
కైలాసగిరి మీద సుమారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో 65 అడుగుల ఈ భారీ త్రిశూలాన్ని నిర్మించారు. ఇక దీని నిర్మాణం పనులు పూర్తి చేయడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది. కైలాసగిరి ప్రాంతంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలిచేలా ప్రత్యేక డిజైన్‌తో ఈ భారీ త్రిశూలం నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కైలాసగిరిపై శివపార్వతులు కొలువై ఉండటంతో ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాధాన్యం మరింతగా ఏర్పడింది. కైలాసగిరికి సరికొత్త శోభ చేకూరింది.
గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా :
విశాఖను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని విశాఖ ఎంపీ శ్రీ భరత్ చెబుతున్నారు. కైలాసగిరిలో భారీ త్రిశూలం ప్రారంభోత్సవం అన్నది అందులో కీలక ఘట్టంగా ఆయన వెల్లడించారు. త్రిశూలం పరిసర ప్రాంతాన్ని పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దుతూ ప్రత్యేక పాత్‌వే జోన్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. కైలాసగిరి నుంచి విశాఖ నగర అందాలను వీక్షించడం పర్యాటకులకు మరింత ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తుందని ఆయన వివరించారు. ఇక చూస్తే కనుక గత కొన్ని నెలలుగా విశాఖలో పర్యాటకం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు విశాఖకు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు. దాంతో కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ఎంపీ భరత్ ప్రకటించారు.
వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా :
విశాఖను రానున్న కాలంలో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిలను రచిస్తోంది అని కూటమి మంత్రులు నారాయణ కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల, కైలాసగిరి, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను సమగ్రంగా అనుసంధానిస్తూ వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. విశాఖకు వచ్చిన పర్యాటకులు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదించేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ప్రకృతి అందాలను ఆస్వాదించేలా విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వారు స్పష్టం చేశారు.