తొలిసారి విశాఖ నుంచి - చెన్నై - ఫుకెట్ - లంకావి - కౌలాలంపూర్ - సింగపూర్.. క్రూజ్ ట్రిప్ ప్యాకేజ్ ఇదేనట!
చెన్నై నుంచి అయితే జులై 18న జర్నీ మొదలవుతుంది. జులై 28నాటికి సింగపూర్ కు చేరుకుంటుంది.;
పోర్టు సిటీగా పిలిచే విశాఖపట్నం నుంచి తొలిసారి అంతర్జాతీయ క్రూజ్ పర్యాటకం ప్రారంభం కానుంది. ఇందుకు జులై 15 డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విశాఖ పోర్టు ఆవరణలో అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ఉందన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు క్రూజ్ లు దేశీయంగా పలు ప్రాంతాల్ని పర్యటించగా.. తాజాగా కార్డేలియా క్రూజ్ విశాఖ నుంచి బయలుదేరి చెన్నై మీదుగా పలు దేశాల్ని చుట్టేలా ఒక ట్రిప్ ప్లాన్ చేశారు.
జులై 15న విశాఖపోర్టులో మొదలయ్యే ఈ జర్నీ.. చెన్నైకు చేరి అక్కడ రెండు రోజులు ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి థాయ్ లాండ్ లోని పుకెట్.. మలేషియాలోని లాంకావి.. కౌలాలంపూర్.. సింగపూర్ వరకు ప్రయాణిస్తుంది. చెన్నై నుంచి అయితే జులై 18న జర్నీ మొదలవుతుంది. జులై 28నాటికి సింగపూర్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి విమానంలో రావాల్సి ఉంటుంది. ట్రావెల్ షెడ్యూల్ చూస్తే..
విశాఖలో జులై 15న ప్రారంభం
చెన్నైలో జులై 18 న తిరిగి స్టార్ట్ అవుతుంది
జులై 19-21 హైసీలో
జులై 22-23 థాయ్ లాండ్ లోని పుకెట్
జులై 24 మలేసియాలోని లాంకావి క్రూజ్ టెర్మినల్ కు
జులై 26 కౌలాలంపూర్
జులై 27-28 సింగపూర్
మొత్తం పద్నాలుగు రోజుల ట్రిప్ సింగపూర్ కు చేరుకోవటంతో ముగుస్తుంది. అక్కడి నుంచి ఎవరికి వారు తమ స్వస్థలాలకు విమానాల్లో తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్డేలియా క్రూజ్ లో జర్నీపై ఇప్పటికే ఒక అంచనా ఉందన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం విశాఖలో మొదలైన ఈ క్రూజ్ తన మొదటి ట్రిప్ ను చెన్నైకు వెళ్లటం.. ఈ ట్రిప్ గురించి అప్పట్లో ప్రసార మాధ్యమాల్లోనూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ ఇంటర్నేషనల్ క్రూజ్ ట్రిప్ కు వెళ్లాలని భావించే వారు కనీసం ఆర్నెల్ల గడువుతో కూడిన పాస్ పోర్టు కలిగి ఉండాలి. థాయ్ లాండ్.. మలేషియాలకు వీసా అవసరం లేదని.. సింగపూర్ లో మాత్రం అక్కడికక్కడే తీసుకోవచ్చని చెబుతున్నారు. మరిన్ని వివరాలకు కార్డేలియా క్రూజ్ వెబ్ సైట్ ను సంప్రదిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
టూర్ సంస్థలు చెబుతున్న దాని ప్రకారం ఈ టూర్ షెడ్యూల్ ఇలా ఉంటుంది
టూర్ షెడ్యూల్ (10 రాత్రులు - 11 రోజులు)
భారత సముద్ర జలాల నుంచి ప్రారంభమై సింగపూర్ తో ముగిసే ఈ ట్రిప్ టారిఫ్ ధరల్ని చూస్తే..
ఇంటీరియర్ గది (ఇందులో కిటికీ ఉండదు) రూ68 వేలు - రూ.75 వేలు
కిటికీ ఉన్న రూం రూ.85- 95వేలు
బాల్కనీ రూం రూ.1.20 లక్షలు - రూ.1.40 లక్షలు
సూట్ రూం కోసం రూ.2 లక్షలకు పైనే ఉంటుందని చెబుతున్నారు.
ఈ ప్యాకేజీతో ఫైవ్ స్టార్ భోజనం.. బస.. ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఉంటాయి. విమాన టికెట్లు.. వీసా ఫీజులు.. పోర్టు టాక్సులు అదనంగా ఉండొచ్చు. అందమైన బీచ్ లు.. సాహస క్రీడలు అస్వాదించే వీలుంది. ఈ ట్రిప్ కు వెళ్లాలని భావిస్తే.. ముందుగానే బుక్ చేసుకోవటం మంచిదని చెబుతున్నారు. ఆఫర్ల కోసం.. సరసమైన ధరల కోసం సంబంధిత ఏజెంట్లను సంప్రదిస్తే మంచిదని చెప్పాలి.