అయ్యగారి ప్రయాగ్ రాజ్ ట్రిప్ కోసం 50 మందిని రెఢీగా ఉంచాలట

ఈ నెల 25, 26 తేదీల్లో అయ్యగారు ప్రయాగ్ రాజ్ ట్రిప్ కు చేయాల్సిన ఏర్పాట్ల చిట్టాను అధికారిక ఉత్తర్వు రూపంలో సిద్ధం చేసి.. కిందిస్థాయి అధికారులకు పంపారు.;

Update: 2026-02-26 04:51 GMT

ఎంత అత్యుత్తమ స్థాయిలో ఉంటే మాత్రం మరీ.. అంత అతా? అన్నట్లుగా ఉంది బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ తీరు. అతగాడి అతి ఎంత పీక్స్ అన్న దానికి నిదర్శనంగా అతడి ప్రయాగ్ రాజ్ ట్రిప్ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్ల మీద అధికారిక ఉత్తర్వులు సోషల్ మీడియాలోకి రావటంతో ఇతగాడు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నారు. సాధారణంగా అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారు ట్రిప్ కోసం ఎక్కడికైనా వెళ్లే వేళ.. కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అంతేకానీ.. అధికారికంగా ఉత్తర్వులు పంపి మరీ.. ఇస్పెషల్ ఏర్పాట్లు చేయించుకుంటున్న తీరు.. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వు పేరుతో విడుదలైన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ నెల 25, 26 తేదీల్లో అయ్యగారు ప్రయాగ్ రాజ్ ట్రిప్ కు చేయాల్సిన ఏర్పాట్ల చిట్టాను అధికారిక ఉత్తర్వు రూపంలో సిద్ధం చేసి.. కిందిస్థాయి అధికారులకు పంపారు. అందులో తనకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి వివరంగా పేర్కొన్నారు. అందులో తన స్నానానికి చేయాల్సిన ఏర్పాట్లు.. ముందుగానే సిద్ధం చేయాల్సిన సామాగ్రితో పాటు.. ఆలయ సందర్శన సమయంలో చేయాల్సిన ఏర్పాట్లు.. ఇందుకు అవసరమైన 21 పనుల కోసం 50 మంది అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు.

అంతేనా.. తాను బస చేసే హోటల్ వద్ద డ్రైఫ్రూట్ బౌల్.. ఫ్రూట్ బౌల్.. షేవింగ్ కిట్.. టవల్.. పేస్ట్.. బ్రష్.. సబ్బు.. షాంపూ.. దువ్వెనతో పాటు ఆయిల్ లాంటివి సిద్ధంగా ఉంచాలన్నారు. అంతేకాదు.. ప్రయాగ్ రాజ్ సంగమం వద్ద స్నానానికి అవసరమైన అండర్ గార్మెంట్ తో పాటు టవల్.. కొత్త చెప్పులు.. అద్దం.. ఘాట్ వద్ద కూర్చోటానికి కొత్త దుప్పటి లాంటివి కూడా సిద్ధంగా ఉంచాలంటూ అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

అయ్యగారి అతి ఎంతలా ఉందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా.. ఆయన జారీ చేసిన ఉత్తర్వు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. అది కాస్తా వైరల్ గా మారటంతో కేంద్ర సమాచార శాఖా మంత్రి వరకు విషయం వెళ్లింది. ఆయనపై చర్యలకు ఆదేశించటమే కాదు.. ఏడు రోజుల్లో ఈ అతిపై వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయ్యగారి అతికి ఆ మాత్రం స్పందన ఉండాల్సిందే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News