ఆఖరి విమానంతో విశాఖలో ఒక చరిత్ర సమాప్తం !

ఎవరూ కూడా ఏనాడూ అనుకోలేదు, భోగాపురం అనే చిన్న గ్రామీణ ప్రాంతానికి వైభోగం వస్తుందని. అక్కడ ఏకంగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వస్తుందని కూడా అసలు ఊహించలేదు.

Update: 2026-07-28 07:56 GMT

ఏదైనా నెమ్మదిగా మొదలవుతుంది. కాలక్రమంలో చరిత్రగా రూపుదిద్దుకుంటుంది. అలాంటిది కనుక ఆగిపోతే చరిత్ర పుటలలోకి వెళ్ళిపోతుంది. ఇపుడు విశాఖ విమానాశ్రయం విషయం కూడా అలాగే ఉంది. విశాఖ ఎయిర్ పోర్టుకు చివరి ఘడియలు ప్రాప్తిస్తున్నాయి. అయిదారు దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ విమానాశ్రయం తన అందమైన అనుభూతులను మధుర జ్ఞాపకాలను ఇక మీదట పదిలంగా చరిత్రలో ఉంచబోతోంది. దానికి కారణం విశాఖ ఎయిర్ పోర్టు కార్యకలాపాలు నిలిచిపోవడమే. ఇది బాధాకరమైన వార్తే కానీ అనివార్యం అని ఎయిర్ లైన్స్ వర్గాలు అంటున్నాయి.

భోగాపురానికి భోగం :

ఎవరూ కూడా ఏనాడూ అనుకోలేదు, భోగాపురం అనే చిన్న గ్రామీణ ప్రాంతానికి వైభోగం వస్తుందని. అక్కడ ఏకంగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వస్తుందని కూడా అసలు ఊహించలేదు. కానీ అది జరిగింది. భోగాపురానికి ఎర్ర బస్సులే ఆగడం కష్టమైన దశను గత దశాబ్దాలలో అంతా చూశారు. కానీ ఇపుడు ఎయిర్ బస్సులే తరలి వస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం అభివృద్ధి విస్తరించడం. భోగాపురం ఎయిర్ పోర్టుని నాలుగు వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. దాదాపుగా మూడు వేల ఎకరాలతో దీని నిర్మాణం సాగింది. దేశీయ విదేశీయ విమానాలతో రానున్న కాలం అంతా భోగాపురానిదే అని వేరేగా చెప్పాల్సింది లేదు. హైదరాబాద్ కి శంషాబాద్ మాదిరిగా ఉత్తరాంధ్రా మొత్తానికి భోగాపురం గ్రోత్ ఇంజన్ అవుతుందని పాలకులు ధీమాగా ఉన్నారు. అంతే కాదు రానున్న కాలంలో మూడు జిల్లాలూ ఒక్కటిగా మారిపోతాయని అంటున్నారు.

విశాఖ ఎయిర్ పోర్టు క్లోజ్ :

ఇక ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆ తరువాత మంచి ముహూర్తం చూసుకుని శ్రావణ మాసంలోని ఆగస్టు 17 నుంచి భోగాపురంలో ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. దాంతో విశాఖ ఎయిర్ పోర్టు సరిగ్గా అదే ముహూర్తానికి క్లోజ్ అవుతుందని అంటున్నారు. ఆగస్టు 16 అర్ధ రాత్రి నుంచే విశాఖ ఎయిర్ పోర్టు మూత పడుతోంది. చివరి పౌర విమానం ఆ రోజు అర్ధ రాత్రి ఎగరడంతో ఈ చారిత్రాత్మకమైన ఎయిర్ పోర్టు కధ ముగియనుంది. చరిత్ర పుటలలో కలవనుంది. ఆగస్టు 17 నుంచి మొదటి విమానం భోగాపురం ఎయిర్ పోటు నుంచి ఎగరడంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు. విమానాలు అన్నీ భోగాపురం నుంచే ఎగురుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

సెంటిమెంట్ గానే :

ఈ వార్త అయితే విశాఖ వాసులను కలవరపెడుతోంది. విశాఖ ఎయిర్ పోర్టుతో ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో అనుభూతులు ఉన్నాయని అంటున్నారు. ఎంతో మంది ప్రముఖులు విశాఖకు ఈ ఎయిర్ పోర్టు నుంచే వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. దేశ విదేశీయ ఉద్ధండులు ప్రముఖులు వీవీఇపీలు నడయాడిన ఈ ఎయిర్ పోర్టు ఒక్కసారిగా మూత పడడం అంటే సెంటిమెంట్ గా చూస్తే బాధగానే ఉందని నగర వాసులు అంటున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుని డొమెస్టిక్ ఎయిర్ పోర్టుగా అయినా నడపాలని కోరుతున్నారు. అంతే కాదు విశాఖ సిటీకి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్టు ఉంచాల్సిన అవసరం గుర్తు చేస్తున్నారు. కానీ దీని మీద ప్రభుత్వ పరంగా ఏ రకమైన హామీ లేదు, దాంతో అధికారికంగా ఈ ఎయిర్ పోర్టు మూతపడడానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News