అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు.. వేడుకల వేళ కూలిన భవనం 17 మంది మృతి
ఆలోచించేందుకు కూడా మనసు ఒప్పుకోని ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఏకంగా 17 మంది ప్రాణాలు పోయేలా చేసింది.;
ఆలోచించేందుకు కూడా మనసు ఒప్పుకోని ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఏకంగా 17 మంది ప్రాణాలు పోయేలా చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిని అనుకొని ఉండే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన గురించి తెలిసిన వారంతా షాక్ కు గురవుతున్నారు. వినాయకచవితి ముందు రోజు అర్థరాత్రి 12 గంటల వేళలో పుట్టినరోజు వేడుకల్ని మహా సరదాగా జరుపుకుంటునన వేళలో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ లోని నారంగిలోని ఒక నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. పాతికేళ్ల ఓంకార్ జోవిల్.. 24 ఏళ్ల ఆరోహీ ఓంకార్ దంపతులకు ఒక్కగానొక్క బిడ్డ ఉత్కర్ష. ఆ చిన్నారి మొదటి పుట్టినరోజును రోటీన్ కు భిన్నంగా అర్థరాత్రి 12 గంటల వేళలో కేక్ కట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సన్నిహిత స్నేహితుల్ని.. బంధువుల్ని ఇంటికి ఆహ్వానించారు.
సరిగ్గా 12 గంటల వేళలో హ్యాపీ బర్త్ డే అని చెబుతూ.. కేక్ కట్ చేయించిన వేళ.. ఆ ప్లాట్ సందడిగా ఉంది. అంతలోనే వారి కాళ్ల కింద ఉన్న నేల కదిలిపోవటం.. తేరుకునే లోపే.. భవనం కుప్పకూలింది. వర్షాల కారణంగా ఈ భవనం బాగా నానటం.. అనూహ్య రీతిలో కూలిపోయింది. ఈ శిథిలాల్లోనే చిన్నారి. ఆమె తల్లిదండ్రులతో పాటు మొత్తం 17 మంది సమాధి అయ్యారు. ఎనిమిది మంది గాయపడ్డారు. బుధవారం 15 డెడ్ బాడీలను.. గురువారం మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. రమాబాయి అపార్టు మెంట్ పేరుతో ఉన్న ఈ నాలుగు అంతస్తుల భవనాన్ని 2011లో నిర్మించారు. అంటే.. కేవలం 14 ఏళ్లకు పేకమేడలా ఈ భవనం కూలిపోయింది.
అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ అపార్టుమెంట్ ను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ అపార్టుమెంట్ లో మొత్తం 50 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 12 ఫ్లాట్లు ఉన్న ఒక భాగం పూర్తిగా ఒక పక్కకు కూలిపోయింది. లక్కీగా ఈ భాగం కూలిన ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పింది. ఈ భవనాన్ని నిర్మించిన బిల్డర్ నిట్టల్ సానేపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేసిన ఇతడ్ని అరెస్టు చేశారు. ఈ ఘోర విషాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.