కదం తొక్కిన దళపతి విజయ్-జాతకాలు తారు మారు ?

దళపతి విజయ్ సినిమా స్టామినా ఏమిటో అందరికీ తెలుసు. ఇరవయ్యేళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి గత మూడు దశాబ్దాలకు పైగా తన సూపర్ స్టార్ డం తో వెండి తెర మీద ఆరాధ్య కధా నాయకుడు అయ్యాడు.;

Update: 2026-04-24 04:58 GMT

దళపతి విజయ్ సినిమా స్టామినా ఏమిటో అందరికీ తెలుసు. ఇరవయ్యేళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి గత మూడు దశాబ్దాలకు పైగా తన సూపర్ స్టార్ డం తో వెండి తెర మీద ఆరాధ్య కధా నాయకుడు అయ్యాడు. అయితే విజయ్ తొలిసారి రాజకీయ తెర పైకి వచ్చారు. ఆయన సినీ గ్లామర్ రాజకీయ గ్రామర్ కలసి తమిళనాడులో మ్యాజిక్ క్రియేట్ చేసిందా అన్న చర్చ సాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారి తమిళనాడులో పోలింగ్ ఈ స్థాయిలో జరగలేదని కేంద్ర ఎన్నికల సంఘం నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 85 శాతానికి పై దాటింది. ఇంత భారీ పోలింగ్ ఎవరి జాతకాలను తారు మారు చేస్తాయో అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో ఎక్కువగా కొత్త ఓటర్లు యూత్ పోలింగ్ బూత్ ల వద్ద సందడి చేయడంతో ఇదంతా విజయ్ మానియా అని కూడా విశ్లేషణలు వస్తున్నాయి.

రెండు సీట్లలోనూ :

ఇదిలా ఉంటే టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో భారీ ఆధిక్యంతో గెలుస్తారు అని అపుడే ప్రచారం మొదలైపోయింది. దానికి కారణం ఈ రెండు సీట్లలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడమే. విజయ్ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చిరపల్లి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేశారు. ఈ రెండు సీట్లూ కూడా డీఎంకేకి బలమైన స్థావరాలుగా ఉన్నాయి. అదే సమయంలో అన్నా డీఎంకేకు మంచి పట్టు ఉన్న సీట్లు ఇవి. మరి సంప్రదాయ ఓటర్లు ఎపుడూ తాము మొదటి నుంచి అభిమానించే పార్టీలకే ఓటు వేస్తారు. అయితే ఈసారి ఆ ఓటింగ్ ని విజయ్ తన వైపు తిప్పుకున్నారా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఓటర్లు యువ ఓటర్లను ఆయన పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారని కూడా విశ్లేషణలు వస్తున్నాయి.

రికార్డు బద్ధలు :

ఇక పోలింగ్ ముగిసిన తరువాత చూస్తే ఈ రెండు సీట్లలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయింది. దాంతో ఈ పోలింగ్ అంతా విజయ్ కోసమే అని విశ్లేషణలు ఉన్నాయి. ఎటు చూసినా పెద్ద ఎత్తున యువ ఓటర్లు బారులు తీరి పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడడం అలాగే మధ్య తరగతి వర్గాల వారు కూడా మండుటెండలో ఓటింగ్ కోసం క్యూలలో వేచి ఉండడం ఇవన్నీ కొత్తదనం రాజకీయాన్ని కోరుకుంటున్న సంకేతాలే అని అంటున్నారు. దీంతో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే టీవీకే అధినేత విజయ్ భారీ మెజారిటీతో ఈ రెండు సీట్లను గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారు అని అంటున్నారు.

పోలింగ్ సరళి ఇలా :

ఇక విజయ్ పోటీ చేసిన సీట్లు కావడంతో ఈ రెండు సీట్ల మీద తమిళనాడు వ్యాప్తంగా పెద్ద చర్చ సాగింది. అంతే కాదు ఫోకస్ అంతా ఈ వైపే ఉంది. అధికార డీఎంకే ప్రతిపక్ష అన్నా డీఎంకే కూడా ఈ సీట్ల మీదనే గురి పెట్టారు. ఈ క్రమంలో విజయ్ పోటీ చేసిన ఈ సీట్లలో అమాంతం పోలింగ్ శాతం పెరిగిపోవడంతో ఇదంతా విజయ్ మీద ఉన్న సినీ అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించారు అని అంటున్నారు. ఇక పెరంబూరులో చూస్తే కనుక 89.12 శాతం, తిరుచ్చిరపల్లి తూర్పు నియోజకవర్గంలో 81.51 శాతం పోలింగ్ జరిగింది. ఇది ఇంతకు ముందు ఎన్నడూ జరగని పోలింగ్. దాంతో విజయ్ రెండూ చోట్లా గెలిచి ఎమ్మెల్యే కావడం ఖాయమని అంతటా వినిపిస్తున్న మాట.

పోటీ పడి మరీ :

ఇక ఈ రెండు చోట్లా చూస్తే ఎక్కువ మంది కొత్త ఓటర్లు తమ పేర్లను ఓటు కోసం నమోదు చేసుకున్నారు. అంతే కాదు చాలా మంది యువ ఓటర్లు అయితే ఎకంగా విజయ్ టీవీకే పార్టీ రంగుల దుస్తులను ధరించి పోలింగ్ బూత్ లకు వచ్చి తమ అభిమానన్ని తాము ఎవరికి ఓటు చేస్తున్నామన్నది చాటుకున్నారు. అదే విధంగా చాలా మంది వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తూ కూడా నానా ప్రయాసలు పడి మరీ విజయ్ కోసం ఓటు వేసేందుకు ఈ నియోజకవర్గాలకు చేరుకున్నారని ప్రచారం సాగింది. ఇక ఒక యువతి అయితే వీడియో సోషల్ మీడియాలో పెట్టి మరీ విజయ్ కి సారీ చెప్పడం సంచలనం రేపుతోంది. తాను సమయానికి బస్సులో రాలేకపోయాను అని విజయ్ కి ఓటు వేసే చాన్స్ మిస్ అయ్యాను అని ఆమె ఏడుస్తూ పెట్టిన ఈ వీడియో బైట్ చూస్తే తమిళనాడులో ప్రధానమైన యూత్ ఏ వైపు ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు.

విజయ్ అంటే క్రేజ్ :

ఇక విజయ్ అంటే తమిళనాడులో జనాలకు ఒక గొప్ప క్రేజ్. ఆయన కొత్త సినిమా రిలీజ్ రోజు ధియేటర్లు జాతరను తలపించేవి. అలాంటిది ఆయనే పార్టీ పెట్టి జనం ముందుకు వస్తే ఇక జనాలు ఊరుకుంటారా అని అంటున్నారు. దంతో పోలింగ్ బూత్ లే కిటకిటలాడాయని అంటున్నారు. విజయ్ టీవీకే కొత్త పార్టీ అయినప్పటికీ యువత మధ్య తరగతి, కార్మిక వర్గాలు న్యూట్రల్ ఓటర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారని దాంతో వారే ఆయనకు బలమైన ఓటు బ్యాంక్ గా నిలబడ్డారు అని అంటున్నారు. ఇక ఇదే పరిస్థితి మిగిలిన నియోజకవర్గాలలో ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆయన కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్ అవుతారా అన్న చర్చ అయితే ఈ భారీ పోలింగ్ తరువాత తమిళనాడు అంతటా ఏర్పడింది అంటున్నారు.

Tags:    

Similar News