తమిళ ఎన్నికల్లో విజయ్ ప్రభావం... గ్రౌండ్ రియాలిటీ ఇదే !

సినిమాల్లో దశాబ్దాలుగా రాణించి రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ హిట్ అయిన వారు అతి కొద్ది మంది. ఫట్ అయిన వారే ఎక్కువ.;

Update: 2026-04-04 16:30 GMT

సినిమాల్లో దశాబ్దాలుగా రాణించి రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ హిట్ అయిన వారు అతి కొద్ది మంది. ఫట్ అయిన వారే ఎక్కువ. తమిళనాడు నుంచే సినిమా రాజకీయాలు పెనవేసుకుని పోవడం అన్నది మొదలైంది. తొలి తరంలో అక్కడ ఒక కరుణా నిధి, ఎంజీఆర్, జయలలిత సినిమాల్లో తమదైన బలమైన ముద్ర వేశారు. ఆ మీదట రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగారు. ఏకంగా సీఎం చెయిర్ నే వారు పట్టేశారు. ఈ రోజుకీ తమిళనాడులో ఈ ముగ్గురూ జనాలకు ఆరాధ్య దైవాలు. ఆ తరువాత మాత్రం ఎందుకో సినిమా వారికి రాజకీయ ఆదరణ అనుకున్న స్థాయిలో అయితే లేదు అన్నది వాస్తవం.

వీరంతా గ్రేట్ కానీ :

ఇక తరువాత కాలంలో శివాజీ గణేషన్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినా అంతగా సక్సెస్ కాలేదు, ఇక విజయ్ కాంత్ సినిమాల్లో సూపర్ స్టార్ డం ని ఎంజాయ్ చేసినా రాజకీయాల్లో మాత్రం పెద్దగా విజయవంతం కాలేకపోయారు. ఇక కమల్ హాసన్ వెండి తెర మీద విశ్వ నటుడు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా ఆయన అయితే రాలేదు. మరో సీనియర్ హీరో శరత్ కుమార్ వంటి వారు రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించు కొందామని చేసిన ప్రయత్నానికి మంచి ఫలితాలను ఇవ్వలేదు.

విజయ్ దళపతిగా :

ఇక తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న వారు విజయ్. దళపతిగా అభిమానుల గుండెల్లో ఆయన ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని 2021లోనే అనుకున్నారు. కానీ ఆయన పార్టీ పెట్టి పోటీ చేయడం మాత్రం 2026 ఎన్నికల నాటికి సాధ్యపడింది అయిదు పదులు వయసు దాటిన విజయ్ కి సినీ రంగంలో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. కానీ ఆయన మాత్రం రాజకీయాల్లోకి రావాలని గట్టిగా తీర్మానించుకుని పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు టీవీకే. ఆయన ద్రవిడ సిద్ధాంతాలను నమ్ముకుని పార్టీని స్థాపించారు. డీఎంకే అన్నా డీఎంకేలను మాత్రమే కాదు బీజేపీ ఫిలాసఫీని సైతం వ్యతిరేకిస్తూ తమిళనాడులో సరికొత్త రాజకీయ ఆల్టర్నేషన్ గా నిలవాలని విజయ్ చూస్తున్నారు.

మొత్తానికి మొత్తం :

ఇదిలా ఉంటే మొత్తానికి మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు విజయ్ పార్టీ పోటీ చేయడం తమిళనాడులో విశేషం. పొత్తుల విషయంలో ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా కాదని చెప్పి సొంతంగా పోటీకి దిగాలనుకోవడం సాహసమే కానీ అది ఆయన రాజకీయ నిబద్ధతను తెలియచేస్తోంది అని చెప్పాలి. రాజకీయాల్లో జనాలను నమ్ముకుని తన పార్టీ ద్వారా వారికి మేలు చేయాలని తన అంకిత భావాన్ని వారు ఆదరించి ఆశీర్వదిస్తారు అన్న నమ్మకంతో విజయ్ రంగంలోకి దిగిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తామని ఆయన భావిస్తున్నారు.

కత్తి మీద సాము :

అయితే రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అన్న దానికి చూస్తే కనుక గడచిన దశాబ్దాలలో నిరాశే మిగులుతుంది. తమిళనాడు మాత్రమే కాదు తెలుగు నాట కూడా ఎన్టీఆర్ తరహాలో మరో సినీ నటుడు రాణించలేకపోయారు. దానికి కారణం ప్రజలు సినిమాలను రాజకీయాలను వేరుగా చూస్తున్నారు. మరో వైపు చూస్తే తమిళనాడు అయినా ఏపీ అయినా బలమైన రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు వాటిని దాటి కొత్త పార్టీకి చోటు ఇచ్చే పరిస్థితులు బహు తక్కువగా కనిపిస్తున్నాయి. సంప్రదాయ ఓట్లు ఆయా పార్టీలకు సులువుగా వెళ్ళిపోతాయి. దాంతో కొత్తగా తమదైన ఓటు బ్యాంక్ ని సాధించుకోవడం అయితే కష్ట సాధ్యం అవుతుంది అని అంటున్నారు. ఇపుడు తమిళనాడులో రెండు బలమైన పార్టీలు దశాబ్దాలుగా అధికారం అందుకున్నవి అయిన డీఎంకే, అన్నా డీఎంకే వంటివి ఉన్నాయి. వాటిని మించి మూడవ పార్టీ ఎస్టాబ్లిష్ కావడం అన్నది విజయ్ టీవీకే పార్టీకి కత్తి మీద సాముగా ఉందన్నది గ్రౌండ్ రియాలిటీ చెబుతోంది.

ఓటు షేర్ ఓకే కానీ :

కొత్తగా పార్టీ పెట్టి రంగంలోకి దిగిన విజయ్ కి ఓటు షేర్ విషయంలో పది శాతానికి మించి లభిస్తుంది అని సర్వేలు అయితే చెబుతున్నాయి. డబుల్ డిజిట్ తొలి ప్రయత్నంలో అంటే మెచ్చతగినదే. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎన్ని వస్తాయో చెప్పలేని స్థితి ఉందని అంటున్నారు. ఇక డీఎంకే అన్నా డీఎంకే బలంగా ఉన్న చోట్ల టీవీకే తన ప్రభావం అంతగా చూపించలేకపోతోంది అని అంటున్నారు. అదే సమయంలో ఆ పార్టీలు పోటీ చేయని సీట్లు చాలా ఉన్నాయి. పొత్తులలో భాగంగా మిత్రులకు ఆయా సీట్లు ఇచ్చాయి. అలా చూస్తే కాంగ్రెస్ బీజేపీలకు ఇచ్చిన సీట్లలో అదే విధంగా ఇతర పార్టీలకు ఇచ్చిన సీట్లలో విజయ్ పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తోంది అని అంటున్నారు. మరి ఇక్కడ కనుక సక్సెస్ అయితే విజయ్ పార్టీకి సీట్లు సైతం ఒక మాదిరిగా రావచ్చు అని అంటున్నారు. అయితే విజయ్ ప్రభావం కింగ్ గానా కింగ్ మేకర్ గానా అంటే వస్తున్న సర్వేల బట్టి చూస్తే ఈ రెండూ కాదని తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజులలో ఏ విధంగా పుంజుకుంటుందో.

Tags:    

Similar News