'విజయ్ అనే నేను'.. తమిళనాడు సీఎంగా రేపే ప్రమాణ స్వీకారం..?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ కొనసాగిన అనిశ్చితి ఇప్పుడు క్లియర్ అవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.;
తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ కొనసాగిన అనిశ్చితి ఇప్పుడు క్లియర్ అవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే దీనిపై రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
శనివారం టీవీకే ప్రతినిధి బృందం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి తమకు మద్దతు తెలిపిన పార్టీల లేఖలను సమర్పించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. టీవీకేకు మద్దతుగా నిలిచిన పార్టీలతో కలిసి మెజార్టీ మార్క్ అయిన 118 స్థానాలకు పైగా సంఖ్యాబలం చేరుకోవడంతో గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖరారైనట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అసెంబ్లీలో టీవీకేకు 107 స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి 5, సీపీఐకి 2, సీపీఎంకు 2, వీసీకేకు 2, ఐయూఎంఎల్‌కు 2 స్థానాలు దక్కాయి. ఈ మద్దతుతో విజయ్ నాయకత్వంలోని కూటమి సంఖ్యాబలం 120కి చేరుకుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మెజార్టీని టీవీకే సులభంగా దాటేసింది.
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వీసీకే మాత్రం క్యాబినెట్‌లో చేరబోమని స్పష్టం చేసింది. వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియాతో మాట్లాడుతూ.. “ప్రస్తుతం మేం ప్రభుత్వంలో చేరడం లేదు. వెలుపలి నుంచే మద్దతు ఇస్తాం. భవిష్యత్తులో ప్రభుత్వంలో భాగమవుతామా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇవ్వకుండా ప్రజల తీర్పును గౌరవించే ఉద్దేశంతోనే మద్దతు ప్రకటించాం” అని తెలిపారు. తాము ఇప్పటికీ డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే కొనసాగుతున్నామని వీసీకే, ఐయూఎంఎల్ నేతలు స్పష్టం చేయడం గమనార్హం.
ఇప్పటికే వామపక్ష పార్టీలు కూడా మంత్రి పదవులపై ఆసక్తి లేదని వెల్లడించాయి. దీంతో విజయ్ కేబినెట్ పూర్తిగా టీవీకే ఆధీనంలోనే ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు చెన్నై సమీపంలోని రిసార్ట్‌లో ఉన్న టీవీకే ఎమ్మెల్యేల భద్రతను పోలీసులు భారీగా పెంచారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామంగా మారింది. ప్రజా మద్దతుతో ఎన్నికల్లో సత్తా చాటిన విజయ్, ఇప్పుడు సీఎం పదవిని అధిరోహించబోతుండటం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.