ఆ 25 నిమిషాల్లో ఏం జరిగింది? మోదీతో సీఎం విజయ్ భేటీ ఇంట్రెస్టింగ్

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Update: 2026-05-27 14:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సీఎం హోదాలో బుధవారం తొలిసారిగా ఆయన హస్తినలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జన ఖర్గేలతో ఆయన సమావేశాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ ముందుగా ప్రధాని మోదీతో కీలక భేటి నిర్వహించారు. సుమారు 25 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సాగిన సమావేశంలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతుతో మే 10న విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఆయన ఢిల్లీ బాట పట్టారు. బుధవారం ఉదయం 10 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన విజయ్‌కు ఢిల్లీలోని తమిళనాడు భవన్ వద్ద అధికారులు, మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రి ఆధవ్ అర్జునతోపాటు, మరికొందరు సహచరులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

పీఎం మోదీతో కీలక భేటీ

సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి విజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ సమస్యలపై ప్రధానికి విజయ్ ఒక సమగ్రమైన మెమొరాండం సమర్పించారని చెబుతున్నారు. అదే సమయంలో కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకేదాటు ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2018 నాటి కావేరి ట్రిబ్యునల్ ఆదేశాలను ఇది ఉల్లంఘించడమేనని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని విజయ్ ప్రధాని మోదీని కోరారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు కేంద్ర నిధులను పెంచాలని సీఎం విజయ్ కోరినట్లు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమిళనాడుకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎరువులను సరఫరా చేయాలని మరో వినతిపత్రం సమర్పించారని అంటున్నారు. టెక్స్‌టైల్ రంగానికి ఊరటనిచ్చేలా పత్తి 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించాలని విజయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ అధికారంలోకి వచ్చిన విజయ్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించేందుకే ఈ భేటీకి ప్రాధాన్యత ఇచ్చారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం విజయ్ తో భేటీ అనంతరం పీఎంవో ఆ ఫొటోలను ‘ఎక్స్’లో పోస్టు చేసింది.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోనూ భేటీ!

ప్రధాని మోదీతో సమావేశం అనంతరం విజయ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను, హోం మంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. అదేవిధంగా విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా విజయ్ కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద రాహుల్, విజయ్ ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. అటు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రసిద్ధ తమిళ కవి-సంతు 'తిరువళ్ళువర్' విగ్రహాన్ని కూడా విజయ్ ఈ పర్యటనలో ఆవిష్కరించనున్నారు. 28వ తేదీన ఆయన తిరిగి చెన్నై చేరుకోనున్నారు.

Tags:    

Similar News