అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయండి: వెంకయ్య డిమాండ్
మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి.. ఒకప్పటి బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.;
మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి.. ఒకప్పటి బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం మరింత సంచలనంగా మారింది. అయితే.. ఆయన నేరుగా ఏ ప్రభుత్వమనేది స్పష్టం చేయలేదు. కానీ, ఆయన వ్యాఖ్యలు.. ఎంచుకున్న అంశాలను బట్టి.. రెండు తెలుగు రాష్ట్రాలను అనేది మాత్రం స్పష్టమవుతోంది.
వెంకయ్య నాయుడు తాజాగా మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల సాధారణ వ్యక్తులు బస్సులు ఎక్కడం మానేశారని అన్నారు. పైగా.. అనుకున్న ప్రయోజనం కూడా రాజకీయ పరమైందన్నారు. ఎంతో మంది కడుతున్న పన్నులను రాజకీయ కాంక్షలతో కొందరికి పరిమితం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే.
ఇక, విద్య, వైద్యంపై ఖర్చు చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలకు ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు. వాస్తవానికి ఉచితాలకు వెంకయ్య ఎప్పుడు వ్యతిరేకమే. కానీ, చిత్రం ఏంటంటే బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున రూ.,10000 నగదును మహిళలకు ఉచితంగా ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇస్తామన్నారు. దీనిపై వెంకయ్య మౌనం వహించడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇక, విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయని వెంకయ్య తీర్మానించారు.
ఇక, రాష్ట్రాలు చేస్తున్న అప్పులు.. ప్రజలకు గుదిబండలుగా మారుతున్నాయని వెంకయ్య వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ''ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు...ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలి'' అని వెంకయ్య డిమాండ్ చేయడం గమనార్హం. అయితే.. ఆయన ఏ రాష్ట్రం అనేది చెప్పకపోవడంతో ఎవరు దీనిపై రియాక్ట్ అవుతారో చూడాలి.