మనసు ముందుకు.. వయసు వెనక్కు: హనుమంతన్న రాజకీయం!
హనుమంతన్నగా అందరికీ సుపరిచితుడు.. రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ ఒకానొక దశలో పేరు తెచ్చుకున్న వీ. హనుమంతరావు..;
హనుమంతన్నగా అందరికీ సుపరిచితుడు.. రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ ఒకానొక దశలో పేరు తెచ్చుకున్న వీ. హనుమంతరావు.. తాజాగా తెలంగాణలో బీసీ జేఏసీ చేపట్టిన బంద్ లో పాల్గొన్నారు. తాను కూడా `నేను సైతం` అంటూ ఫ్లెక్సీ పట్టుకుని పాదయాత్ర చేశారు. కానీ, ఆయన వయసు 80+ కావడంతో మనసు దూకుడుగా ఉన్నా.. వయసు దూకుడుగా ఉండదు కదా.. హఠాత్తుగా ఆయన కిందపడిపోయారు. దీంతో ఉలిక్కిపడ్డ నేతలు.. ఆయనను లేవదీసి.. వెంటనే సపర్యలు చేశారు.
ఈలోగా కొందరు అంబులెన్సుకు కూడా ఫోన్ చేశారు. కానీ, అది వచ్చేలోగానే.. హనుమంతన్న లేచి నిలబడ్డాడు. అనంతరం.. అక్కడితోతన నిరసన ఆపి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదిలావుంటే.. ఇందిరమ్మ హయాం నుంచి బలమైన కాంగ్రెస్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు వీహెచ్. ఇందిరమ్మ దగ్గర యాక్సెస్ ఉన్న అతి కొద్ది మంది తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒకరు. పార్టీ కోసం.. అచంచల విశ్వాసంతో ముందుకు సాగుతున్న నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
తన తరంలో అనేక మంది నాయకులు కాంగ్రెస్ జెండా పట్టుకున్నా.. చాలా మంది వివిధ రాజకీయ పార్టీల్లో చేరారు. వారి వారి అభిరుచులు.. ఆశయాల మేరకు పనిచేశారు. కానీ, హనుమంతన్న మాత్రం తనకు అవమానాలే ఎదురైనా.. రెడ్ కార్పట్లే పరిచినా.. రెండింటినీ సమానంగానే భావించారు. అగ్ర నాయకులను సైతం ఏక వచనంతో సంబోధించే సీనియర్ నేతగా వీహెచ్ నిలిచారు. అంతేకాదు.. ఏ విషయాన్నయినా.. ఆయన నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. పార్టీలో ఇబ్బందులు ఉంటే.. ఉన్నాయని ఒప్పుకొంటారు తప్ప.. కలరింగ్ ఇవ్వరు.
``నేనేమడిగిన.. ఇన్నాళ్లు సేవ చేసిన గదా.. ఒక్క గవర్నర్ గిరీ ఇయ్యరాదే.. అన్న. దానికి ఆమె ఒప్పుకొంట లేదు.`` అంటూ.. 2004-09 మధ్య ఆయన సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలు ఇంకా గుర్తున్నాయి. వీహెచ్ జీవితంగా కేంద్ర మంత్రిపదవులు ఆశించారు. కానీ రాలేదు. అయినా.. ఆయన అసంతృప్తి చెందలేదు. ఎప్పటికప్పుడు ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అయితే.. ఆయన మనసు దూకుడుగా ఉన్నా.. వయసు దూకుడుగా ఉండదు కదా!. సో.. ఇప్పుడు ఇక, విశ్రాంతి తీసుకోవడమే బెటర్ అంటున్నారు సీనియర్లు.