ఏపీ సహకరించడం లేదు...తెలంగాణా ఘాటు ఆరోపణ
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక బంధాలు ఉన్నాయి. విడిపోయినా కూడా నదీ జలాల విషయంలో కానీ ఇతర అంశాలలో కానీ కలసి పనిచేయాల్సిన అవసరం అయింది.;
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక బంధాలు ఉన్నాయి. విడిపోయినా కూడా నదీ జలాల విషయంలో కానీ ఇతర అంశాలలో కానీ కలసి పనిచేయాల్సిన అవసరం అయింది. మరీ ముఖ్యంగా జల వివాదాలు అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. వాటి విషయంలో ఏపీ తెలంగాణా సామరస్యంగా ముందుకు వెళ్ళాల్సింది. ఇదిలా ఉంటే కృష్ణా నదీ జలాల విషయంలో అయితే జగడాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీ మీదనే :
ఉభయ రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నదీ జలాల విషయంలో వినియోగం ఎవరిది ఎంత అన్నది తెలుసుకోవడానికి టెలి మెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ సహకరించడం లేదని తెలంగాణాకు చెందిన జలవనరుల సాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నీటిని ఏ రాష్ట్రం ఎంత వాడుతోంది అన్నది తెలుసుకునేందుకు తెలంగాణా పద్దెనిమిది చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు. అయితే మరో ఇరవై టెలి మెట్రి స్టేషన్లు ఏర్పాటు కావాల్సి ఉందని ఆయన అన్నారు. దానికి ఏర్పాటు చేసేందుకు ఏపీ ముందుకు రావడం లేదని ఆయన వీమ్ర్శించారు.
కేంద్రానికే చెప్పాం :
అయితే ఈ ఇరవై టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ తన వంతుగా నిధులు ఇవ్వకపోయినా తామే ఇచ్చి ఏర్పాటు చేయిస్తామని కేంద్రానికి చెప్పామని ఆయన మీడియాతో చెప్పారు. అయినా ఏమి జరుగుతుందో తెలియదని అన్నారు. ఇంకో వైపు బనకచర్ల విషయం మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల విషయంలో తాము వ్యతిరేకిస్తున్నామని అయినా అనుమతులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఊరుకోమని స్పష్టం :
ఏపీలో చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ ని తెలంగాణా కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. అసలు బనకచర్లను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణాలో చేపడుతున్న పలు నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ఆయన కోరారు. మొత్తానికి ఏపీ మీద తెలంగాణా మంత్రి చేసిన ఈ తరహా విమర్శలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన జవాబు వస్తుందో చూడాల్సి ఉంది.