ఏనుగు మింగిన వెలక్కాయ..బంగ్లాలా..అమెరికా చేతిలో పడితే అంతే!
పై రెండు ఉదాహరణలు మన భారత ఉప ఖండంలోని దేశాల విషయంలో జరిగినవి కావడం గమనార్హం. అమెరికా చేయి పెడితే ఎంతటి దేశమైనా.. ఎంతటి గొప్ప నాయకుడు అయినా పతనం కావాల్సిందే.;
బంగ్లాదేశ్ లో 2024లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది షేక్ హసీనా సారథ్యంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మరో ఐదేళ్లు తిరుగులేదు అనుకున్నారు అందరూ. కానీ, 8 నెలల్లోనే పతనం అయిపోయింది. షేక్ హసీనా ఏకంగా బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. దీనికి కారణం.. అమెరికా.
25 ఏళ్లకు పైగా సుదీర్ఘ పోరాటం అనంతరం పాకిస్థాన్ కు ప్రధానమంత్రి అయ్యారు దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. కానీ, ఉక్రెయిన్ పై యుద్దానికి దిగిన రష్యాలో పర్యటిచడంతో పదవిని కోల్పోయి జైలు పాలయ్యారు. అసలు ఎప్పుడు బయటకు వస్తారో? బతికి ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. కారణం.. అమెరికా.
పై రెండు ఉదాహరణలు మన భారత ఉప ఖండంలోని దేశాల విషయంలో జరిగినవి కావడం గమనార్హం. అమెరికా చేయి పెడితే ఎంతటి దేశమైనా.. ఎంతటి గొప్ప నాయకుడు అయినా పతనం కావాల్సిందే. ఇప్పుడు వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోకు ఎదురైన పరిస్థితే గతంలో చాలామంది దేశాధినేతలకు, దేశాలకు ఎదురైంది. మొదట దేశాన్ని ఆక్రమించడం దశాబ్దాల పాటు వాడుకుని వదిలేయడం అమెరికాకు మొదటినుంచి ఉన్న అలవాటు.
ఇరాక్ ను పీల్చి పిప్పి చేసి..
సద్దాం హుస్సేన్ పాలనలో కలో గంజో తాగుతూ బతుకిన ఇరాక్ ఇప్పుడు ఓ నిర్భాగ్యురాలిగా మిగిలిపోయింది. తమ మాట వినని సద్ధాంను దింపేందుకు ఇరాక్ లో సామూహిక జీవాయుధాలు ఉన్నాయంటూ అమెరికా దాడికి దిగింది. ఆయనను పదవి నుంచి దింపేసింది. చివరకు తీవ్రమైన అభియోగాలు మోపి కోర్టు మరణశిక్ష విధించేలా చేసింది. ఇదంతా 2003 నుంచి జరిగింది. 2006 చివరల్లో సద్దాంను ఉరితీశారు. అప్పటినుంచి ఇరాక్ బతుకు చిందరవందర అయింది. ఇప్పటికీ తిరుగుబాటుదారులు, మత వర్గాలు, ప్రాంతీయంగా ఆధిపత్య పోరాటాలు, ఐసిస్ ఉగ్రవాదంతో ఇరాక్ కుదేలవుతోంది.
అఫ్ఘాన్ ను 20 ఏళ్లు వాడుకుని...
2001 సెప్టెంబరు 11న తమ దేశంపై జరిగిన వైమానిక దాడులకు అఫ్ఘానిస్థాన్ లో తలదాచుకున్న ఆల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ కారణం అంటూ ఆ దేశంపై దాడులకు దిగింది అమెరికా. నాటో దళాల సాయంతో అఫ్ఘాన్ ను జల్లెడ పట్టింది. 2001లోనే అఫ్ఘాన్ రాజధాని కాబూల్ లోకి ప్రవేశించిన అమెరికా బలగాలు అప్పటి తాలిబన్లను వెళ్లగొట్టాయి. హమీద్ కర్జాయ్ ను అధ్యక్షుడిని చేశాయి. కానీ, అవినీతి, బంధుప్రీతి కారణంగా ఇదో విఫల ప్రయోగంగా మారింది. ఫలితంగా తాలిబన్లు మళ్లీ పట్టు సాధించారు. 2021లో ఇలా అమెరికా బలగాలు వెళ్లిపోగానే అలా తాలిబన్లు అఫ్ఘాన్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
బంగ్లాను బలి చేసి..
బంగాళాఖాతాలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ కు చెందిన సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అమెరికా వాడుకుంటామని ప్రతిపాదించింది. కానీ, షేక్ హసీనా సర్కారు ఒప్పుకోలేదు. దీంతో ఆమెను పదవి నుంచి దిగిపోయేలా కుట్ర చేశారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత నిరుడు సెప్టెంబరులో చిట్టగాంగ్ పోర్టు డెవలప్ మెంట్ కు అమెరికా-బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. ఇక హసీనా వెళ్లిపోయాక బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇదీ.. అమెరికా చేయి పెడితే జరిగే అనర్థం.
వెనెజులాను ఏం చేస్తారో?
మదురోను దించేశాక... వెనెజులాను తామే పాలిస్తామంటూ ట్రంప్ తొలుత ప్రకటించారు. తర్వాత మాట మార్చారు. ప్రపంచంలోనే చమురు అత్యధిక నిల్వలున్న ఈ దేశాన్ని అంత తొందరగా వదలరు అనేది మాత్రం నిజం. వెనెజులా పాలకులు అంటే మొదటినుంచి అమెరికాకు కళ్లమంటే. ట్రంప్ నకు ఇది ఇంకా ఎక్కువే అనుకోవచ్చు.