ట్రంపా మజాకా... ఒళ్లున్నా, ఒంట్లో షుగరున్నా అమెరికా వీసా కష్టమే!

రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-11-07 15:47 GMT

రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫలితంగా.. ఎన్నో వేళ మందిని ట్రంప్ నిర్ణయాలు దెబ్బతీసిన పరిస్థితి. ఈ సమయంలో ట్రంప్ మస్తిష్కంలో మరో కొత్త ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా... పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనలను రూపొందించారు.

అవును... డయాబెటిస్‌, ఒబెసిటీ, హృదయ సంబంధ వ్యాధులు, నాడీ సంబంధిత సమస్యలు వంటి వ్యాధులతో బాధపడేవారికి ఇకపై అమెరికా వీసాలు అందని ద్రాక్షలు కాబోతున్నాయి. ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులర్‌ కార్యాలయాలకు విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈ విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

జాబితాలో మరిన్ని వ్యాధులు..!:

వాస్తవానికి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమిగ్రేషన్‌ అధికారులు పరిశీలిస్తారు. ఇందులో భాగంగా... అంటు వ్యాధులు ఏమైనా ఉన్నాయో లేదో స్క్రీనింగ్‌ చేస్తారు. అయితే తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ.. ఈ జాబితాలో మరిన్ని వ్యాధులను చేరుస్తూ కొత్త మార్గదర్శకాలు రూపొందించారు.

ఇకపై అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునేవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పిల్లలు లేదా వృద్ధ తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

కొత మార్గదర్శకాల్లో కీలక విషయాలు!:

ఈ సందర్భంగా విడుదలైన నూతన మార్గదర్శకాల్లో పలు కీలక విషయాలను పొందుపరిచారు. ఇందులో భాగంగా... దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుుంది. ఇందులో ప్రధానంగా... హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు, జీవక్రియ సంబంధ సమస్యలతో బాధపడేవారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇదే క్రమంలో... ఒబెసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్‌ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతుండటం వల్ల ఈ వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం అవుతాయి. దీనికి ఆర్థిక భారం కూడా ఎక్కువే.. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడుతారో లేదో గుర్తించాలి.. ఒకవేళ ఆధారపడేవారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలి.

ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల వెర్షన్ ఇది!:

ఈ సందర్భంగా స్పందించిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు... క్షయవ్యాధి తనిఖీల నుండి టీకా రికార్డుల వరకు ఆరోగ్య పరీక్షలు ఎల్లప్పుడూ ఇమ్మిగ్రేషన్ ప్రాసెసింగ్‌ లో భాగంగా ఉన్నాయని తెలిపారు. అయితే... కొత్త మార్గదర్శకాలు ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని సృష్టించగలదా అని నిర్ణయించడానికి అధికారులకు ఎక్కువ విచక్షణను ఇస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News