అమెరికాలో టోర్నడోల బీభత్సం.. అతలాకుతలం అవుతున్న ప్రజల జీవితాలు

తాజాగా సోమవారం (మే 19, 2025) వచ్చిన కనీసం నాలుగు టోర్నడోల ధాటికి టెక్సాస్ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి.;

Update: 2025-05-21 07:07 GMT

అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఒక్లహామా, మిస్సోరి, కాన్సాస్, కెంటకీ రాష్ట్రాలు ఈ విపత్తుతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత కొన్ని రోజులుగా వచ్చిన శక్తివంతమైన టోర్నడోలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తు ప్రజల జీవితాలను తలకిందులు చేసింది.

తాజాగా సోమవారం (మే 19, 2025) వచ్చిన కనీసం నాలుగు టోర్నడోల ధాటికి టెక్సాస్ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. సుమారు 1,15,000 మందికి పైగా ప్రజలు విద్యుత్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

ఒక్లహామా రాష్ట్రంలో ఒక అగ్నిమాపక కేంద్రంతో సహా కనీసం 10 నివాస భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. కెంటకీ రాష్ట్రం ఈ టోర్నడోల ధాటికి అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా కెంటకీలోని లండన్ నగరంలో విమానాశ్రయం కూడా నేరుగా టోర్నడో దాడికి గురైంది. చిన్న విమానాలు దెబ్బతిన్నాయి, వాటి రెక్కలు తెగిపోయాయి. సహాయక చర్యలకు ఈ విమానాశ్రయం ఒక కేంద్రంగా మారింది. ఇక్కడ ఆహారం, నీరు, డైపర్లు వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. లాసన్‌ కౌంటీలో కూడా భారీ విధ్వంసం జరిగింది.

సెయింట్ లూయిస్ (మిస్సోరి) నగరంలో శుక్రవారం (మే 16, 2025) సంభవించిన టోర్నడో కారణంగా కనీసం 5,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) పైగా ఉంటుందని అంచనా. ఈ టోర్నడో దాదాపు 8 మైళ్ల దూరం ప్రయాణించి, గంటకు 150కిమీ వేగంతో గాలులతో, గరిష్టంగా ఒక మైలు వెడల్పుతో విధ్వంసం సృష్టించింది. నగర మేయర్ ఫెడరల్ సహాయం అందడానికి వారాలు పట్టవచ్చని హెచ్చరించారు. రెస్క్యూ బృందాలు ఇంటింటికి తిరిగి నష్టాన్ని అంచనా వేస్తున్నాయి.

ఉత్తర టెక్సాస్‌లో భారీ వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఇక్కడ ఏకంగా 11.4 సెం.మీ (సుమారు 4.5 అంగుళాలు) వ్యాసం ఉన్న వడగళ్లు పడ్డాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ వడగళ్లు చాలా పెద్దవిగా, ప్రమాదకరంగా ఉన్నాయి. టోర్నడోల ధాటికి పలు జాతీయ రహదారులు కూడా దెబ్బతినడంతో అధికారులు వాహనాలను అనుమతించడం లేదు, దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గత కొన్ని రోజుల్లో ఈ విపత్తుల కారణంగా 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కెంటకీలోనే 19 మంది మరణించారు. మిస్సోరిలో ఏడుగురు, వర్జీనియాలో రెండు మరణాలు సంభవించాయి. చాలా మంది గాయపడ్డారు, కొందరు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.

Tags:    

Similar News