షట్ డౌన్ ఎఫెక్ట్ భారీగా స్టార్ట్... ట్రంప్ ఏమి చేద్దామనుకుంటున్నారు..?

ట్రంప్ సర్కార్ షట్ డౌన్ ఎఫెక్ట్ అమెరికా విమానాయన రంగంపై భారీ ప్రభావం చూపించబోతోంది.;

Update: 2025-11-06 08:03 GMT

ట్రంప్ సర్కార్ షట్ డౌన్ ఎఫెక్ట్ అమెరికా విమానాయన రంగంపై భారీ ప్రభావం చూపించబోతోంది. ఈ సందర్భంగా.. ప్రభుత్వ షట్‌ డౌన్ ఇలాగే కొనసాగితే శుక్రవారం ఉదయం నుంచి అమెరికాలోని 40 ప్రధాన విమానాశ్రయాలలో విమాన ప్రయాణ సామర్థ్యం 10% తగ్గుతుందని రవాణా కార్యదర్శి సీన్ డఫీ హెచ్చరించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమస్యలను నివేదిస్తున్నందున ఈ నిర్ణయం అని తెలిపారు.

అవును... అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ ఎఫెక్ట్ తీవ్రంగా మారబోతోంది. అమెరికా చరిత్రలో అతి పొడవైన ఈ షట్‌ డౌన్ సమయంలో.. కంట్రోలర్లు జీతం లేకుండా పని చేయాల్సి వచ్చిందని.. దీనివల్ల కొంతమంది ఇతర జాబ్‌ లు చేసుకోవాల్సి వచ్చిందని.. మా కంట్రోలర్‌ లకు ఒక నెల పాటు జీతం చెల్లించకపోవడం సాధారణ విషయం కాదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ బ్రయాన్ బెడ్‌ ఫోర్డ్ అన్నారు.

ఈ క్రమంలో విమానాల తగ్గింపులు క్రమక్రమంగా జరుగుతాయని రాయిటర్స్ నివేదించింది. ఇందులో భాగంగా శుక్రవారం దేశీయ విమానాలలో తగ్గింపు 4% నుండి ప్రారంభమవుతుందని.. తరువాత శనివారం 5%, ఆదివారం 6% కి పెరుగుతుందని.. ఈ క్రమంలో వచ్చే వారం పూర్తి 10% ని చేరుకుంటుందని తెలిపింది. ఈ రద్దులు రోజుకు 3,500 నుండి 4,000 విమానాలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన బెడ్ ఫోర్డ్... మనం భావించని విధంగా ఒత్తిళ్లు పెరుగుతాయని.. ఫలితంగా మనం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన వ్యవస్థను నిర్వహిస్తున్నామని ప్రజలకు చెప్పడం కొనసాగించ లేమని అన్నారు. అందుకే దీన్ని అదుపు చేయాల్సి వస్తుందని వెల్లడించారు. ఇది ఇలానే కొనసాగితే అదనపు నియంత్రణ చర్యలు అవసరం కావచ్చని అన్నారు.

ఇదే క్రమంలో... 20,000 మందికి పైగా విమానయాన కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం అధ్యక్షుడు నిక్ డేనియల్స్ స్పందిస్తూ... పరిస్థితిని తీవ్రంగా వివరించారు. ఇందులో భాగంగా.. కారులో గ్యాస్ నింపడానికి కూడా తగినంత డబ్బు లేదు, పనికి రావడానికి నా దగ్గర లేదు అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మెసేజ్ చేస్తున్నారని తెలిపారు.

కాగా... అమెరికా ప్రభుత్వ షట్‌ డౌన్ 37వ రోజుకు చేరుకుంది. ఇది అమెరికా ప్రభుత్వం మూసివేయబడిన అతి పెద్ద కాలం. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ షట్‌ డౌన్.. కొత్త నిధుల ఒప్పందానికి కాంగ్రెస్ అంగీకరించలేకపోవడంతో మొదలైంది. దీని వలన ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు లేకుండా, లక్షలాది మంది అమెరికన్లు అవసరమైన సేవలు పొందకుండా పోయారు.

Tags:    

Similar News