ఇరాన్ యుద్ధం.. చేతులెత్తేసిన అగ్రరాజ్యం.. ఇది అవమానమే
ఒకవైపు ఇరాన్ వ్యవహారంలో రక్షణపరమైన విమర్శలు వస్తుండగానే.. ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.;
అంతర్జాతీయ రాజకీయ యవనికపై అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు వాషింగ్టన్ ప్రతిష్టను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకవైపు సైనిక చర్యల విషయంలో వెనక్కి తగ్గడం.. మరోవైపు మిత్రదేశాలైన ఐరోపా దేశాలపై వాణిజ్య యుద్ధానికి దిగడం చూస్తుంటే.. అమెరికా తన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
యుద్ధం ముగిసింది.. అనుమతి అక్కర్లేదు.. శ్వేతసౌధం వాదన
ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) అనుమతి తీసుకోకపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఈ విమర్శలను శ్వేతసౌధం తోసిపుచ్చింది. ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఇరాన్ చాప్టర్ ముగిసిందని.. కాబట్టి కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదంపై సెనెట్ విచారణలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వివరణ ఇచ్చారు. ఆయన వాదన ప్రకారం.. ఇరాన్‌పై జరిగిన సైనిక చర్య కేవలం 60 రోజులకు లోపే ముగిసింది. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం, 60 రోజులలోపు ముగిసే సైనిక చర్యలకు అధ్యక్షుడికి సర్వాధికారాలు ఉంటాయి, కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి కాదు. ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించిందని, ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల ఆగ్రహం.. అగ్రరాజ్యానికి ఇది అవమానమేనా?
ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రతిపక్ష డెమొక్రాట్లు, రాజకీయ విశ్లేషకులు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాంగ్రెస్‌ను సంప్రదించకుండా యుద్ధ నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని వారు మండిపడుతున్నారు.
అంతకంటే ముఖ్యంగా ఇరాన్ విషయంలో అమెరికా వ్యవహరించిన తీరు "పీచేముడ్" లాగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ వంటి దేశం ముందు అగ్రరాజ్యం తలవంచడం.. నిర్ణీత లక్ష్యాలను చేరుకోకుండానే యుద్ధం ముగిసిందని ప్రకటించడం దేశ ప్రతిష్టను దిగజార్చిందని, ఇది అమెరికాకు ఒక రకమైన అవమానమేనని విపక్షాలు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నాయి.
మరోవైపు వాణిజ్య యుద్ధం.. ఐరోపాపై సుంకాల బాదుడు
ఒకవైపు ఇరాన్ వ్యవహారంలో రక్షణపరమైన విమర్శలు వస్తుండగానే.. ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల నుంచి దిగుమతి అయ్యే వాహనాలపై భారీగా సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈయూ దేశాల నుంచి అమెరికాకు వచ్చే కార్లు, ట్రక్కులపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 25 శాతానికి పెంచారు. ఐరోపా దేశాలతో కుదుర్చుకున్న పాత వాణిజ్య ఒప్పందాలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, అవి సక్రమంగా అమలు కావడం లేదని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం
ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్లోబల్ మార్కెట్లు ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా దేశాలు కూడా ప్రతిచర్యగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచే అవకాశం ఉంది. ఫలితంగా పూర్తిస్థాయి 'ట్రేడ్ వార్' మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం రెండు వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రక్షణ పరంగా ఇరాన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు 'అవమానకరమైన వెనకడుగు'గా ముద్ర పడగా వాణిజ్య పరంగా ఐరోపాతో పెట్టుకున్న గొడవ అంతర్జాతీయ సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చుతోంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ "అమెరికా ఫస్ట్" విధానం ప్రపంచ రాజకీయాల్లో ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.