భారత్ -ఈయూ డీల్ పై ఓపెన్ గా ఏడ్చేసిన అమెరికా ఏడుపు
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొంటున్న భారత్ -ఈయూ మధ్య జరిగిన ఒప్పందంపై అగ్రరాజ్యం తన అక్కసును వెళ్లగక్కింది. ఎప్పటిలానే పాత పాటను పాడింది.;
దేశం ఏదైనా సరే.. తాము చెప్పినట్లు.. తాము రాసిన స్క్రిప్టుకు తగ్గట్లు ఉండాలే తప్పించి.. మరెవరూ అంతకు మించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదన్నట్లుగా ఉంటోంది అగ్రరాజ్యం అమెరికా తీరు. అనుక్షణం తన ప్రయోజనాలు.. తన లాభాలు తప్పించి మరేవీ వారికి పట్టని సంగతి తెలిసిందే. తాము బాగుంటే సరి.. మరెవరు బాగున్నా కానీ ఓర్చుకోలేని తత్త్వం వారిలోకొట్టొచ్చినట్లు కనిపించటం తెలిసిందే.
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొంటున్న భారత్ -ఈయూ మధ్య జరిగిన ఒప్పందంపై అగ్రరాజ్యం తన అక్కసును వెళ్లగక్కింది. ఎప్పటిలానే పాత పాటను పాడింది. ఈ డీల్ తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొంది. ఉక్రెయిన్ లో ఇంకా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. ఐరోపా సమాఖ్య మాత్రం తమ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు.
ఆయన గతంలోనూ ఇదే తీరులో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. గత ఏడాది భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించినప్పుడు.. తమ మాదిరే భారత్ పై అదనపు సుంకాల్ని విధించేందుకు ఈయూ అప్పట్లో విముఖత వ్యక్తం చేసిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ‘‘వాళ్లకు ఏది మంచిదో అదే వారు చేయాలి కానీ.. యూరోపియన్లు నన్ను చాలా నిరాశపర్చారు’’ అంటూ తన ఏడుపును ఓపెన్ గా చెప్పేశారు.
ఉక్రెయిన్ ప్రజల కంటే యూరోప్ తన వాణిజ్య ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందన్న వ్యాఖ్య చేస్తూ.. రష్యా చమురు భారత్ కు వెళుతుందని.. దాన్ని శుద్ధి చేసి భారత్ చమురు ఉత్పత్తులు తయారు చేస్తుందన్నారు. ఇప్పుడు యూరోపియన్లు వాటిని కొనుగోలు చేస్తున్నారన్న స్కాట్.. ‘‘రష్యా యుద్ధానికి వారు పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఈ ట్రేడ్ డీల్ పై బెసెంట్ గతంలోనూ ఇదే రీతిలో రియాక్టు కావటం తెలిసిందే. రష్యా చేస్తున్న యుద్ధాల గురించి మాట్లాడే అమెరికా.. తాను చేసే యుద్ధాల గురించి.. తన ప్రయోజనాల కోసం గ్రీన్ లాండ్ , కెనడా లాంటి దేశాల్ని అమెరికాలో కలిపేసుకోవాలన్న ఆలోచనల గురించి మాత్రం మాట్లాడకపోవటం కనిపిస్తుంది. నీతులు చెప్పేందుకు తగిన అర్హత ఉండాలన్న కనీస విషయాన్ని అమెరికా ఎప్పుడూ మరచిపోతూ ఉంటుందన్న విషయాన్ని వారు మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.