ప్రజలు అన్నీ గమనిస్తారు.. ఏమార్చడం మీ వల్ల కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్!
సినిమాల్లో డైరెక్టర్ కట్ చెబితే నటులు కారు దిగి క్యారవాన్‌లోకి వెళ్తారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం కారవాన్ దిగి.. కెమెరా ఆన్ అవ్వగానే ఆటో ఎక్కుతారు!
సినిమాల్లో డైరెక్టర్ కట్ చెబితే నటులు కారు దిగి క్యారవాన్‌లోకి వెళ్తారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం కారవాన్ దిగి.. కెమెరా ఆన్ అవ్వగానే ఆటో ఎక్కుతారు! ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇంధనాన్ని పొదుపు చేయండి.. కాన్వాయ్‌లను తగ్గించండి’ అని పిలుపునిస్తే మన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలు దాన్ని కాస్త వినూత్నంగా అర్థం చేసుకున్నట్టున్నారు.
ఇంధనం ఆదా చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంచక్కా ఆటోలో ప్రయాణించారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. సీన్ కట్ చేస్తే ఆ ఆటో పక్కనే ఒక ఖరీదైన ఎస్.యూవీ కారు నెమ్మదిగా సాగిపోతోంది. అందులోంచి ఒక కెమెరామన్ బయటకి జరిగి ఆటోలో ఉన్న ఎమ్మెల్యేల ‘సరళ జీవనాన్ని’ అత్యంత శ్రద్ధతో షూట్ చేస్తున్నారు. అంటే.. అక్కడ ఇంధనం పొదుపు అవుతుందా లేదా అనే పక్కన పెడితే పబ్లిసిటీ మాత్రం పిక్సెల్ పిక్సెల్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది!
'బిర్యానీ డైట్' లాంటి పాలిటిక్స్!
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమే ఆలస్యం.. నెటిజన్లు మీమ్స్‌తో సెటైర్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఒక నెటిజన్ అయితే దీనికి అదిరిపోయే రేంజ్‌లో కౌంటర్ఇచ్చారు. "నేను కఠినమైన డైట్‌లో ఉన్నానని అందరికీ చెబుతూ పక్కనే ప్లేట్ నిండా చికెన్ బిర్యానీ లాగించేయడం ఎంత కామెడీగా ఉంటుందో.. ఈ ఎమ్మెల్యేల ఆటో ప్రయాణం కూడా అలాగే ఉంది!" అంటే సెటైర్ వేశారు. మరొక నెటిజన్ "అయ్యా ఎమ్మెల్యే గారు! ఎలాగో పబ్లిసిటీ కోసం అంత కష్టపడుతున్నారు కదా కనీసం ఆ కెమెరామన్‌ను కూడా ఆటోలోనే కూర్చోబెట్టుకుని షూట్ చేయాల్సింది. కనీసం జనాలైనా నమ్మేవాళ్లు ఇలా పక్కన లగ్జరీ కారుని మెయింటైన్ చేస్తూ ఆటోలో వెళ్తే ఎలాగండీ?" అంటూ పెదవి విరిచారు.
రీల్ పాలిటిక్స్ వర్సెస్ రియల్ పాలిటిక్స్
ఈ రోజుల్లో ప్రజలు చాలా అప్‌డేట్ అయ్యారు బాస్! ఏది 'రీల్' పాలిటిక్స్ ఏది 'రియల్' పాలిటిక్స్ అనేది క్షణాల్లో కనిపెట్టేస్తున్నారు. మనం ఆటోలో వెళ్తే జనాలు మనల్ని సామాన్యులుగా చూస్తారు. కానీ వెనుక వచ్చే లగ్జరీ కారు పెట్రోల్ బిల్లు ఎవరు కడుతున్నారు సార్? అంటూ ఈ వీడియోలు చూసి దెప్పిపొడుస్తున్నారు. జనాలకు లీడర్ల నుంచి కావాల్సింది డ్రామాలు కాదు, నిజాయితీ. కెమెరా ముందు ఒకలా కెమెరా వెనుక ఒకలా ఉంటే అడ్డంగా బుక్కైపోవడం ఖాయం అని ఈ యూపీ ఎమ్మెల్యేలు నిరూపించారు.
ప్రధాని మోదీ చెప్పినట్టు నాయకులు ఇంధనాన్ని పొదుపు చేయాలనుకుంటే నేరుగా కారు ఆపేసి నడవడమో లేదా నిజంగానే ఒంటరిగా ఆటో ఎక్కడమో చేయాలి. అంతేకానీ కారులో కెమెరామన్‌ను పెట్టుకుని ఆటో వెనుక తిప్పితే.. ఇంధనంతో పాటు, సదరు నాయకుల ఇమేజ్ కూడా ఇదిగో ఇలా "అడ్డంగా బుక్" అయిపోవడం ఖాయం!