90 రోజల్లో సిమ్ కార్డు రీచార్జి చేయకుంటే.. ఆ తర్వాత జరిగే దశలు ఇవే..

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ప్రతి ఒక్కరి చేతిలో డ్యూయల్ సిమ్ ఉన్న ఫోన్లు ఉండడం సర్వసాధారణం అయిపోయింది.;

Update: 2026-05-03 17:30 GMT

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ప్రతి ఒక్కరి చేతిలో డ్యూయల్ సిమ్ ఉన్న ఫోన్లు ఉండడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, మనం వాడే ఈ కనెక్షన్ల వెనుక మనకు తెలియని ఎన్నో టెలికాం నిబంధనలు దాగున్నాయి. మనకు అవసరం లేదనో లేదంటే అదనపు ఖర్చు ఎందుకనో పక్కన పెట్టేసిన సిమ్ కార్డులు, మనకు తెలియకుండానే మన చేజారిపోయే ప్రమాదం ఉంది. మీ పాత నంబర్ మాయమైపోవడం వెనుక అసలు రహస్యాలు, కంపెనీలు అనుసరించే నిగూఢమైన పద్ధతుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

90 డేస్ సైలెన్స్ మోడ్ లో..

సాధారణంగా చాలా మంది ఒక నంబర్‌ను ప్రధానంగా వాడుతూ, రెండో నంబర్‌ను కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ కోసం లేదంటే ఇతర అవసరాల కోసం పక్కన పెడుతుంటారు. అయితే, ఏ మొబైల్ నంబర్ అయినా 90 రోజుల పాటు ఎటువంటి వినియోగం లేకుండా ఉంటే, అంటే ఎవరికీ ఎస్ఎంఎస్ (SMS) పంపకపోయినా, కాల్స్ చేయకపోయినా లేదా కనీసం రీఛార్జ్ చేయకపోయినా ఆ నంబర్‌ను కంపెనీలు 'ఇనాక్టివ్' కేటగిరీలోకి మారుస్తాయి. ఇలాంటి సమయంలో మొదటగా మీ అవుట్‌గోయింగ్ సేవలు నిలిచిపోతాయి, ఆపై కొద్దిరోజులకే ఇన్‌కమింగ్ సేవలను కూడా కంపెనీ బ్లాక్ చేస్తుంది.

జియో నిబంధనలు..

ప్రముఖ టెలికాం సంస్థ జియో తన వినియోగదారుల కోసం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. మీ సిమ్ 90 రోజుల పాటు వాడకంలో లేకపోయినా, మీ మెయిన్ అకౌంట్‌లో రూ. 20 బ్యాలెన్స్ ఉంటే కంపెనీ మీకు కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఈ సమయంలో కంపెనీ మీ అకౌంట్ నుంచి ఆ బ్యాలెన్స్‌ను మినహాయించుకొని, మీ నంబర్ 'గ్రేస్ పీరియడ్'ను మరో 30 రోజుల పాటు పొడిగిస్తుంది. మీ ప్రధాన ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఈ గడువు పొడిగించబడుతూనే ఉంటుంది, కానీ బ్యాలెన్స్ సున్నా అయిన మరుక్షణమే మీ నంబర్ ఇన్‌యాక్టివ్ మోడ్‌లోకి వెళ్తుంది.

గ్రేస్ పీరియడ్.. ఆఖరి అవకాశం..

ఒకవేళ మీ ఖాతాలో రూ. 20 బ్యాలెన్స్ లేకపోయినా లేదంటే 90 రోజుల గడువు ముగిసినా, టెలికాం కంపెనీలు నంబర్‌ను రద్దు చేయవు. వినియోగదారులకు తమ నంబర్‌ యాక్టివేట్ చేసుకోవడానికి 15 రోజుల పాటు గ్రేస్ పీరియడ్‌ అందిస్తాయి. ఈ సమయంలో మీరు నిర్ణీత రీఛార్జ్ చేయడం ద్వారా గానీ లేదా రీయాక్టివేషన్ ఛార్జీలను చెల్లించడం ద్వారా గానీ మీ పాత నంబర్‌ను మళ్లీ ప్రాణం పోసుకోవచ్చు. 15 రోజులు కూడా గడిచిపోతే మాత్రం మీ నంబర్ శాశ్వతంగా మీ చేజారిపోతుంది.

వేరొకరి సొంతం!

మీ నంబర్ డీయాక్టివేట్ అయిన తర్వాత జరిగే ప్రక్రియ అత్యంత వేగంగా ఉంటుంది. ఒకసారి గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత, టెలికాం కంపెనీలు ఆ నంబర్‌ను మరొక వ్యక్తికి కేటాయించే అధికారాన్ని కలిగి ఉంటాయి. మీ నంబర్ రద్దయిన మరుసటి రోజే ఆ నంబర్‌ను మార్కెట్‌లో కొత్త సిమ్ కార్డుగా వేరే ఎవరికైనా విక్రయించవచ్చు. దీనివల్ల మీ పాత నంబర్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలు లేదా ఇతర సామాజిక మాధ్యమాల సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే, టెలికాం కంపెనీలు తమ వనరులను వృథా చేయకుండా ఉండేందుకు ఇన్ యాక్టివ్ సిమ్ కార్డులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. సెకండరీ సిమ్ ప్రాణప్రదంగా కాపాడుకోవాలంటే, ప్రతి మూడు నెలలకు ఒక్కసారైనా రీఛార్జ్ తప్పనిసరి. చిన్న నిర్లక్ష్యం వల్ల మీ వ్యక్తిగత సమాచారానికి ముప్పు రావడమే కాకుండా, మీరు ఇష్టపడే నంబర్ కూడా వేరొకరి సొంతమవుతుంది.

Tags:    

Similar News