అమెరికానే కాదు ఇంగ్లండ్ కూడా మోతే.. భారత విద్యార్థులకు దారేది?

రాబోయే విద్యా సంవత్సరం నుంచి దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజులను గణనీయంగా పెంచనున్నట్లు ప్రకటించింది.;

Update: 2025-10-22 16:14 GMT

ప్రపంచ విద్యార్థులను కలవరపెట్టే కొత్త నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ ప్రభుత్వం. రాబోయే విద్యా సంవత్సరం నుంచి దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజులను గణనీయంగా పెంచనున్నట్లు ప్రకటించింది. దశాబ్ద కాలానికి పైగా ఈ రకమైన పెంపు జరగడం ఇది రెండోసారి మాత్రమే.

*మంత్రి అధికారిక ప్రకటన

బ్రిటన్ విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్సన్ పార్లమెంట్‌లో చేసిన కీలక ప్రకటనలో ఇంగ్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ ట్యూషన్ ఫీజులను ద్రవ్యోల్బణానికి (ఇన్‌ఫ్లేషన్‌) అనుగుణంగా పెంచనున్నాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వేలకొలది భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేయనుంది.

* ఫీజు పెంపు వివరాలు.. టైమ్‌లైన్

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వార్షిక ట్యూషన్ ఫీజు £9,535 గా ఉంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును (2.2%) బట్టి, వచ్చే సంవత్సరం ఫీజు సుమారు £400 పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం వార్షిక ఫీజు దాదాపు £9,900 దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఈ ఫీజు పెంపు వచ్చే రెండు సంవత్సరాలపాటు కొనసాగుతుంది. 2027 నుంచి ప్రతి ఏడాది ఆటోమేటిక్‌గా ద్రవ్యోల్బణ రేటును బట్టి ఫీజు సవరించబడేలా చట్టం తీసుకువస్తారు. విద్యార్థులకు అందించే మెయింటెనెన్స్ లోన్స్ (నిర్వహణ రుణాలు) కూడా ప్రతి ఏడాది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుతాయి.

నాణ్యత ఆధారిత ఫీజుల వసూలు

కేవలం గరిష్ట ఫీజుల పెంపును మాత్రమే ప్రకటించకుండా, విద్యా నాణ్యతకు కట్టుబడిన యూనివర్సిటీలకు మాత్రమే పూర్తి ఫీజు వసూలు చేసుకునే అధికారం ఉంటుందని మంత్రి ఫిలిప్సన్ స్పష్టం చేశారు. మంచి బోధన, నాణ్యత గల విద్య అందించే విశ్వవిద్యాలయాలను ఆఫీస్ ఫర్ స్టూడెంట్స్ (OfS) నిర్ణయించే ప్రమాణాలను చేరుకోని యూనివర్సిటీలు గరిష్ట ఫీజు వసూలు చేయలేవు. అలాగే వారు చేర్చుకునే విద్యార్థుల సంఖ్యపై కూడా పరిమితి విధించబడుతుంది.

యూనివర్సిటీలకు ఉపశమనం, విద్యార్థులకు భారం

ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ యూనివర్సిటీలకు ఈ నిర్ణయం కొంతవరకు ఊరట కలిగించవచ్చని విద్యా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగా గత ఏడాది యూనివర్సిటీలు కలిపి 12,000కు పైగా ఉద్యోగాలను తగ్గించుకున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అయితే, వేలకొలది భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేవలం యూనివర్సిటీల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల మీద అదనపు భారం వేయడం న్యాయం కాదని వారు వాదిస్తున్నారు.

యూనియన్ల తీవ్ర వ్యతిరేకత

యూనివర్సిటీ అండ్ కాలేజ్ యూనియన్ (UCU) ప్రధాన కార్యదర్శి జో గ్రాడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. "ట్యూషన్ ఫీజు ఆధారిత నిధుల మోడల్‌ను ప్రభుత్వం మరింత కఠినతరం చేయడంతోనే ఈ సంక్షోభం ఏర్పడింది. విద్యార్థుల భవిష్యత్తును తనఖాగా పెట్టి యూనివర్సిటీల ఆర్థిక రంధ్రాలను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.

భారతీయ విద్యార్థులపై ప్రభావం

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో దాదాపు 1.85 లక్షల భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఫీజు పెంపుతో వారి వార్షిక విద్యా ఖర్చు మరో £400 (దాదాపు ₹42,000) పెరుగుతుంది. ఇది ఇప్పటికే అధిక విద్యా ఖర్చులతో బాధపడుతున్న మధ్యతరగతి కుటుంబాలపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో పరిణామాలు

ఈ నిర్ణయం వల్ల UKలో విద్యనభ్యసించాలని అనుకుంటున్న కొత్త విద్యార్థుల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, ఇతర దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ విద్యా విధానాలను మరింత ఆకర్షణీయంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది.

ప్రభుత్వ అధికారులు.. విద్యా నిపుణుల అంచనాల ప్రకారం, ఈ మార్పులు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. విద్యార్థుల సంఘాలు మరిన్ని నిరసనలు చేయడానికి సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం తమ స్థానం మార్చుకోవాలని కోరుతున్నాయి.

Tags:    

Similar News