దీపావళికి ఉద్యోగినులకు ఐఫోన్లు.. కేరళకు చెందిన బిజినెస్ ఉమెన్ సర్ప్రైజ్ గిఫ్ట్!
| యూఏఈలో వ్యాపారం నిర్వహిస్తున్న కేరళకు చెందిన హసీనా నిషాద్ దీపావళి సందర్భంగా తన కంపెనీలోని మహిళా ఉద్యోగులందరికీ ఐఫోన్లు బహుమతిగా ఇచ్చారు. హౌస్‌కీపింగ్ సిబ్బందికి కూడా ఫోన్ అందించి ఆశ్చర్యపరిచారు. ఈ సర్ప్రైజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
పండుగల సమయంలో ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం చాలా కంపెనీల్లో సాధారణమే. అయితే యూఏఈలో వ్యాపార సంస్థను నిర్వహిస్తున్న కేరళకు చెందిన హసీనా నిషాద్ మాత్రం తన ఉద్యోగినులకు ఇచ్చిన బహుమతులతో అందరి దృష్టిని ఆకర్షించారు. దీపావళి సందర్భంగా తన కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ కొత్త ఐఫోన్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హసీనా ఈ సర్ప్రైజ్ను ప్లాన్ చేశారు. మహిళా ఉద్యోగులందరినీ కాన్ఫరెన్స్ రూమ్‌కు పిలిచారు. వారు తమ కుర్చీలను తీసుకునే సమయంలో టేబుళ్ల కింద ఉన్న గిఫ్ట్ బాక్సులను గుర్తించారు. వాటిని తెరిచి చూడగా కొత్త ఐఫోన్లు కనిపించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ వీడియోలో అందరినీ కదిలించిన మరో సంఘటన కూడా ఉంది. ఆఫీస్‌లో హౌస్‌కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న మహిళకు కూడా హసీనా ఐఫోన్ బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగులకు షర్బత్ అందించేందుకు వచ్చిన ఆమెకు కూడా ఈ సర్ప్రైజ్లో చోటు కల్పించారు. ఖరీదైన బహుమతి అందుకున్న ఆమె భావోద్వేగానికి గురై హసీనాను హత్తుకున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఉద్యోగులకు ఐఫోన్లు బహుమతిగా ఇవ్వడం ఈ కుటుంబానికి ఇదే మొదటిసారి కాదు. గతంలో హసీనా భర్త నిషాద్ హుస్సేన్ కూడా తమ సంస్థలోని ఉద్యోగులకు ఐఫోన్లు అందించిన వీడియో వైరల్ అయింది.