ఇండియా కూటమిలోకి విజయ్...వారితో కీలక భేటీ !
తమిళనాడులో కొత్త రాజకీయం మొదలు కాబోతోంది. ద్రవిడ పార్టీల ఊసు లేకుండా చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా ఉంది.
తమిళనాడులో కొత్త రాజకీయం మొదలు కాబోతోంది. ద్రవిడ పార్టీల ఊసు లేకుండా చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా ఉంది. రెండు సార్లు వరసగా ఓడి వాడిన అన్నా డీఎంకేకు భవిష్యత్తు అయోమయంగా ఉంది. ప్రస్తుతానికి నాయకత్వం వహిస్తున్న మాజీ సీఎం పళనిస్వామికి గ్లామర్ లేదు, పార్టీని ముందుకు తీసుకెళ్ళి గెలిపించే సామర్ధ్యం లేదని సొంత పార్టీలోనే అంటున్నారు. దాంతో అన్నా డీఎంకే కధ ముగుస్తోంది అని కూడా చెబుతున్నారు. ఇక నిన్నటిదాకా డీఎంకే అధికారంలో ఉంది.స్టాలిన్ బలమైన నాయకుడు అనుకున్నారు. కానీ సొంత సీట్లోనే ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలు అయ్యారు. ఏడున్నర పదుల వయసులో స్టాలిన్ ఉన్నారు. కుమారుడు ఉదయనిధికి డీఎంకేని విజయపథాన తీసుకుని వెళ్ళే సత్తా లేదని అంటున్న వారూ ఉన్నారు. ప్రజాకర్షణ విషయంలో విజయ్ తో ప్రస్తుతానికి పోటీ పడే వారు అయితే తమిళనాడులో లేరని అంటున్నారు. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ తన అంచనాలు చక్కగా వేసి ముందుకు సాగుతోంది.
విజయ్ తోనే దోస్తీ :
విజయ్ పార్టీ టీవీకేతో కాంగ్రెస్ చెలిమి ఏదో సడెన్ గా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. భవిష్యత్తుని ఊహించే అలా చేశారని అంటున్నారు. దాంతో డీఎంకేని వదిలేశారు. డీఎంకే కూడా ఇండియా కూటమిని పక్కన పెట్టేసింది. ఇపుడు విజయ్ టీవీకేని అధికారికంగా ఇండియా కూటమిలోకి ఆహ్వానించడం ఒక్కటే అనివార్యంగా ఉంది. ఈ క్రమంలో విజయ్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. గత నెల మధ్యలో విజయ్ ఢిల్లీ టూర్ పెట్టుకుని వెళ్ళారు. అప్పట్లో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ఈసారి రెండు రోజుల టూర్ లో మొదటి రోజు అయిన జూన్ 10న కాంగ్రెస్ అగ్ర నేతలు అయిన సోనియా గాంధీని రాహుల్ గాంధీని విజయ్ కలుస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ ని ఇండియా కూటమిలోకి అధికారికంగా ఆహ్వానిస్తారు అని అంటున్నారు. విజయ్ సైతం కాంగ్రెస్ తో పనిచేసేందుకు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని అంటున్నారు.
సౌత్ ఫేస్ గా :
ఇక రాజకీయంగా కొత్తగా వచ్చి ఏకంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రం అయిన తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిన విజయ్ ని సౌత్ ఫేస్ గా కాంగ్రెస్ భావిస్తోంది. 52 ఏళ్ళ విజయ్ రాజకీయంగా యువకుడి కిందనే లెక్క. దాంతో ఆయన సినీ గ్లామర్ రాజకీయ నిబద్ధతను ఆసరాగా చేసుకుని తమిళనాడుతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో సైతం ఆయన ఇమేజ్ ని వాడుకోవాలని కాంగ్రెస్ భారీ స్కెచ్ నే గీస్తోంది అని అంటున్నారు. ఇక దక్షిణాదిన అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న స్టేట్ గా తమిళనాడు ఉంది. అక్కడ 39 సీట్లు ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో టీవీకే మద్దతుతో పోటీకి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. అలాగే ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలా సౌత్ స్టేట్స్ లో ఉన్న 129లో అత్యధిక భాగాన్ని వచ్చే ఎన్నికల్లఒ గెలుచుకుంటే కేంద్రంలో పాగా వేయడానికి కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు. మొత్తానికి విజయ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో భేటీ తరువాత తమిళ రాజకీయంతో పాటు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో పెను మార్పులు సంభవిస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.