పరకామణి లెక్క తేల్చేస్తారా? డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు
పరకామణిలో చోరీ చేసిన నిందితుడు రవికుమార్ తో టీటీడీ రాజీ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో అసలు కుట్రను ఛేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.;
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీపై హైకోర్టు సీరియస్ అయింది. పరకామణిలో చోరీ చేసిన నిందితుడు రవికుమార్ తో టీటీడీ రాజీ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో అసలు కుట్రను ఛేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి టీటీడీ బోర్డు, ఆలయ అధికారులు, దర్యాప్తు అధికారి, పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ పాత్రపై సమగ్రంగా దర్యాప్తు చేసి వచ్చే విచారణ నాటికి సీల్డు కవర్ లో నివేదిక ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
2023లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తిరుమల పరకమాణిలో చోరీ వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడైన రవికుమార్ శ్రీవారి కానుకలుగా వచ్చిన డాలర్లను దొంగిలించినట్లు గతంలో కేసు నమోదైంది. దాదాపు రూ.వంద కోట్ల వరకు నిందితుడు దోచుకుంటే అతడిని శిక్షించకుండా, కోర్టులో కేసు రాజీ కుదుర్చుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఎం.శ్రీనివాసులు అనే జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయించారు. పరకామణిలో జరిగిన చోరీపై సీఐడీ విచారణకు ఆదేశించాలని అప్పటి ఈవోను విన్నవించినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. పరకామణిలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగి రవికుమార్ చోరీ సొత్తుతో పట్టుబడిన విషయాన్ని ఆ పిటిషన్ లో ప్రస్తావించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్దంగా అదే ఏడాది సెప్టెంబరు 9న జరిగిన లోక్ అదాలత్ లో కేసును రాజీ చేసుకున్నారని హైకోర్టుకు నివేదించారు.
ఈ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం విచారణ జరిపిన హైకోర్టు పరకామణి చోరీకి సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేయమని ఆదేశించింది. అదే సమయంలో పిటిషనర్ వినతిపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని ఈవోను కోరింది. సోమవారం మళ్లీ ఈ పిటిషన్ విచారణ రాగా, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడాన్ని తప్పుపట్టిన హైకోర్టు డీజీ స్థాయి అధికారితో విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను డిసెంబరు 2వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టు ముందు ఉంచిన రికార్డులను పరిశీలించిన ధర్మాసనం ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారి, టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు రాజీ ధోరణి, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేసు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడంతోపాటు రాజీ చేసే సమయంలో ప్రిసైడింగ్ అధికారి అనాలోచితంగా వ్యవహరించారని తెలిపారు. పెద్ద జీయర్ మఠం తరఫున పరకామణిలో పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు రవికుమార్ నియమితులయ్యారని, 38 ఏళ్లుగా ఆయన పరకామణిలో సర్వీసు అందించినందున ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడిపై 409 సెక్షన్ కింద అభియోగాలు మోపాల్సివుండగా, రాజీకి అవకాశమున్న సెక్షన్లు నమోదు చేయడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా చోరీ కేసు నిందితుడిపై మోపిన అభియోగాలు సరైనవేనా అన్న విషయం పరిశీలించకుండా అనాలోచితంగా మేజిస్ట్రేట్ చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదు. అతడి ఆస్తులపై ఏసీబీ, క్రైం బ్రాంచ్ ఎలాంటి దర్యాప్తు చేయలేదని తెలిపింది. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకలకు ఆయనే హక్కుదారు. టీటీడీ బోర్డు కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుంది. ఏవీఎస్వో సతీశ్ కుమారు ఏ విధంగా యజమాని కాలేరు, టీటీడీ బోర్డు అనుమతి లేకుండా రాజీ చేసుకునే అధికారం ఆయనకు లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దీంతో పరకామణి చోరీ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది. పరకామణిలో దాదాపు రూ.వంద కోట్లు వరకు కుంభకోణం జరిగిందని అధికార కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల పాత్ర ఉందని చెబుతున్నారు. దీంతో పరకామణి చోరీ రాజకీయ దుమారం రేపుతోంది. డీజీ స్థాయి అధికారితో దర్యాప్తునకు ఆదేశించడంతో గత ప్రభుత్వ పాత్ర వెలుగులోకి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఎవరు బలికానున్నారనే ఉత్కంఠ ఎక్కువ అవుతోంది.