ట్రంప్ కు బిగ్ టాస్క్ అప్పగించిన పుతిన్.. అది జరిగేపనేనా?

మిగిలిన యుద్ధాలన్నీ ఆపడం ఒకెత్తు.. అవిరామంగా కొనసాగుతోన్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం మరొకెత్తు అన్నట్లుగా ట్రంప్ పరిస్థితి మారిపోయిందనే చర్చ గత కొంత కాలంగా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-10-19 12:30 GMT

మిగిలిన యుద్ధాలన్నీ ఆపడం ఒకెత్తు.. అవిరామంగా కొనసాగుతోన్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం మరొకెత్తు అన్నట్లుగా ట్రంప్ పరిస్థితి మారిపోయిందనే చర్చ గత కొంత కాలంగా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ.. నయానో భయానో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ యుద్ధాని ఆపి, తన లెవెల్ వెడల్పు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ట్రంప్ కు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

ట్రంప్ తెచ్చే ప్రతిపాదనలకు అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కానీ, ఇటు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కానీ అంగీకరించడం లేదు. దీంతో.. ఇది ట్రంప్ కు పెద్ద సమస్యగా మారిందని ఒకరంటే.. ఇది ట్రంప్ సామర్ధ్యానికి పరీక్ష అని మరొకరు అంటున్నారు. ఈ సమయంలో ఇటీవల ఉక్రెయిన్ కు క్షిపణులు అందిస్తామని పుతిన్ తో ట్రంప్ బెదిరింపు మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ సమయంలో ఆయన ముందు పుతిన్ బిగ్ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది.

అవును... ఏది ఏమైనా ఈ ఏడాదిలో రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు. పైగా ఇప్పటికే ఆపినట్లు చెప్పుకుంటున్న యుద్ధాలు అన్నీ ఒకెత్తు, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపడం మరొకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిన నేపథ్యంలో.. ఇది ట్రంప్ కు ప్రిస్టేజ్ ఇష్యూగా మారిందని చెబుతున్నారు. ఈ సమయంలో పుతిన్ పెద్ద మెలికే పెట్టారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

ఉక్రెయిన్ లో కీలక ప్రాంతాన్ని కోరుతోన్న పుతిన్!:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ మధ్య గత వారం జరిగిన సుదీర్ఘ ఫోన్‌ కాల్‌ సంభాషణలో ఓ కీలక విషయం ప్రస్తావనకు వచ్చినట్లు వైట్ హౌస్ అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ ఆసక్తికర కథనం అందించింది. ఇందులో భాగంగా... దొనెట్స్క్‌ ప్రాంతాన్ని తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్‌ పట్టుపడుతున్నారని.. అందుకు ఉక్రెయిన్ ఒప్పుకోకపోవడంతోనే యుద్ధం కొనసాగుతోందని అంటున్నారు.

ఈ క్రమంలో... ఇటీవల ట్రంప్‌ ఎదుట పుతిన్‌ ఓ ప్రతిపాదనను ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఇప్పటి తమ సేనల ఆధీనంలో ఉన్న జపొరిజియా, ఖేర్సాన్‌ ప్రాంతాలను ఉక్రెయిన్‌ కు అప్పజెప్పేందుకు సానుకూలతను వ్యక్తం చేశారని.. దీనికి ప్రతిగా ఉక్రెయిన్‌.. దొనెట్స్క్‌ ప్రాంతాన్ని సంపూర్ణంగా తమకు అప్పగించాలని కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు కథనంలో వెల్లడించింది. దీంతో... ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

అయితే... పుతిన్‌ డిమాండ్లపై ఉక్రెయిన్‌ లేదా ఐరోపా సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... వాషింగ్టన్‌ పోస్టు కథనంపై అటు క్రెమ్లిన్‌ కానీ, ఇటు వైట్‌ హౌస్‌ కానీ స్పందించలేదు.

ఆగస్టులోనే ఘాటుగా స్పందించిన జెలెన్ స్కీ!:

వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15న అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... రష్యా, ఉక్రెయిన్‌ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తూ.. శాంతి ఒప్పందం కోసం కొన్ని భూభాగాలు వెనక్కి తీసుకోవడం, మార్చుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

దీంతో వెంటనే జెలెన్ స్కీ స్పందించారు. ఇందులో భాగంగా.. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబోమని.. శాంతి కోసం నిర్వహించే సమావేశాల్లో మా గళాన్ని వినిపించాల్సిందేనని.. ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేమని.. సూటిగా సుత్తి లేకుండా చెప్పిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో... ఆ యుద్ధం ఆపడం ట్రంప్ కు అతిపెద్ద టాస్క్ లా మరింతగా మారుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తోమహాక్‌ క్రూజ్‌ క్షిపణుల విషయంలో ట్రంప్ మౌనం!:

ఉక్రెయిన్ కు తోమహాక్ క్రూజ్ క్షిపణులను అందించే విషయంపై ఇటీవల ట్రంప్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామల నేపథ్యంలో ఉక్రెయిన్‌ కు ఆ ఆయుధాలు ఇచ్చే విషయంలో అమెరికా ఆచితూచీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ట్రంప్‌ తో శుక్రవారం వాషింగ్టన్‌ లో జరిపిన చర్చల్లో తోమహాక్‌ క్షిపణుల సరఫరాపై అమెరికా నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News