ట్రంప్ 'డాడీ టాక్స్'.. వైరల్ గా ఫేక్ పోస్టు!
కానీ.. ఇప్పుడు అగ్రరాజ్యాధినేతగా ఉన్నది ట్రంప్ కావటంతో..ఆయన నోటి నుంచి ఎప్పుడు.. ఎలాంటి వ్యాఖ్య అయినా వస్తుందన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది.;
భారత్ - ఐరోపా సమాఖ్య మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ పన్నుబాదుడు వేళ.. అనూహ్య రీతిలో సంపన్న దేశాల సమూహమైన యూరోపియన్ యూనియన్ తో మోడీ నాయకత్వంలోని భారతదేశం భారీ ఒప్పందాన్ని చేసుకోవటం తెలిసిందే. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొదలుకొని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ సైతం తన ప్రసంగంలో ఈ పదబంధాన్ని ప్రస్తావించటంతో ఈ వ్యాక్యానికి విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదిలా ఉండగా.. భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన భారీ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊడుకుమోతుతనంతో సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లుగా ఒక పోస్టు వైరల్ అవుతోంది. దీని నిజానిజాల్ని పట్టించుకోకుండా చాలానే వెబ్ సైట్లు.. వాట్సాప్ గ్రూపులతో పాటు.. కొన్ని మీడియా సంస్థలు సైతం ఈ ఫేక్ పోస్టును నిజమైన పోస్టుగా భావించి వార్తల రూపంలో అందిస్తున్న పరిస్థితి.
వాస్తవానికి ఈ తరహా వ్యాఖ్యలు అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న అధినేత ఎట్టి పరిస్థితుల్లో చేయరు. కానీ.. ఇప్పుడు అగ్రరాజ్యాధినేతగా ఉన్నది ట్రంప్ కావటంతో..ఆయన నోటి నుంచి ఎప్పుడు.. ఎలాంటి వ్యాఖ్య అయినా వస్తుందన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది. దీంతో.. ఈ ఫేక్ పోస్టును సరిగా చెక్ చేసుకోకుండానే.. ఈ తరహాలో ట్రంప్ పోస్టు పెట్టి ఉంటారని భావించి.. పలువురు దాన్ని నిజమైన పోస్టుగా భావించిన పరిస్థితి. దీంతో.. ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది.
ఇంతకూ ఈ ఫేక్ వైరస్ పోస్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ‘‘అబద్ధాలకోరు ఉర్సులా, భారత బ్రందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. ఇది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే.. వాళ్లు ఇంట్లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు. ఒకే డాడీ ఉంటాడు. అతను ఓవల్ ఆఫీసులో కూర్చొని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు. యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టే.. వాళ్లు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది.
బహుశా వాళ్లు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు. నేను భారతదేశంతో చెప్పాను. మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా యాభై శాతం డాడీ ట్యాక్స్ లు కట్టండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయి. ఆ ఒప్పందం ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్టు మాదిరి ఉంది’’ అంటూ ట్రంప్ తరహా భాషలో పేర్కొనటంతో దీన్ని పలువురు ట్రంప్ పోస్టుగా ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో.. ఈ ఫేక్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతోంది.