బంగారంపై సుంకాలు.. ట్రంప్ క్లారిటీ!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగారం పై సుంకాలు విధించడంపై తీసుకున్న నిర్ణయం కాస్త ఊరట కలిగించింది అని చెప్పవచ్చు.;

Update: 2025-08-12 05:38 GMT

గత ఏడాదికాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరడంతో బంగారానికి రెక్కలు వచ్చాయని సామాన్యులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమైన సందర్భాలలో కూడా ధరలు చూసి కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఇప్పుడు బంగారంపై కూడా సుంకాలు విధిస్తారు అని కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో బంగారంపై సుంకాలు విధిస్తే.. దీని ధర మరింత పెరిగిపోతుంది, అప్పుడు సామాన్యుడే కాదు ధనవంతుడు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు బంగారం ఇకపై అందరికీ అందని ద్రాక్ష వలె మారుతుంది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగారం పై సుంకాలు విధించడంపై తీసుకున్న నిర్ణయం కాస్త ఊరట కలిగించింది అని చెప్పవచ్చు.

ఈసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంశాలపై ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తమ దేశం దిగుమతి చేసుకునే వివిధ దేశాల వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై కూడా సుంకాల పెంపు వర్తిస్తుందా? లేదా? అనే విషయం అందరిలో అనుమానాలు కలిగిస్తోంది. అంతేకాదు దీనిపై ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ.. దీనిపై ట్రంప్ వివరణ ఇస్తూ సుంకాలు విధించబోము అని స్పష్టం చేశారు.

ఈ విషయం తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇదే విషయంపై అమెరికా కస్టమ్స్ విభాగం గతవారం విడుదల చేసిన ప్రకటనలో.. ఒక కేజీతో పాటు 100 ఔన్సుల (2.8 కిలోలు) బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయని.. అటు బంగారంపై సుంకాల విధింపు పై ట్రంప్ క్లారిటీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తారు అంటూ ఒక వైట్ హౌస్ అధికారి వ్యాఖ్యలు చేయడంతో మార్కెట్ వర్గాలలో మరింత గందరగోళం నెలకొనింది. ఈ నేపథ్యంలోనే పసిడి ధర కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే వెంటనే బంగారం పై సుంకాలు లేవు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరికీ కాస్త ఊరట కలిగించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయం తర్వాత ఔన్స్ పై సుమారు 50 డాలర్ల మేర ధర తగ్గడం గమనార్హం.

అలాగే అటు స్విట్జర్ల్యాండ్ నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై 39% సుంకం విధించాలి అని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల నిర్ణయించగా .. అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారు ఉత్పత్తులకు ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందా లేదా అన్నది కూడా స్పష్టత లేదని చెప్పవచ్చు. మొత్తానికైతే ఏఏ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై ఈ సుంకం ఉండదు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి త్వరలోనే దీనిపై ట్రంప్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News