స్పామ్ కు అలా చెక్... బ్యాంక్ కాల్స్ పై బిగ్ అప్ డేట్!
ఈ రోజుల్లో మోసం, స్పామ్ కాల్స్ ప్రజలకు అతి పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే.;
ఈ రోజుల్లో మోసం, స్పామ్ కాల్స్ ప్రజలకు అతి పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. పైగా ప్రస్తుత రోజులు సైబర్ నేరగాళ్లకు అద్భుత గడియలుగా మారాయని అంటున్నారు! ప్రధానంగా తరచు వచ్చే స్పామ్ కాల్స్ ద్వారా ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ట్రాయ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ (జేసీఓఆర్)లో బ్యాంక్ కాల్స్ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది.
అవును... టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రధాన కార్యాలయంలో జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ (జేసీఓఆర్) 9వ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జూలై 22, 2025న జరిగిన 8వ జేసీఓఆర్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల అమలు స్థితిని కమిటీ సమీక్షించింది. ఇందులో భాగంగా... బ్యాంకులు, ఫైనాన్స్ & బీమా కంపెనీలు 1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే కాల్ చేయాలని నిర్ణయించింది!
ఇదే సమయంలో... డిజిటల్ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా జరిగే స్పామ్, మోసపూరిత కార్యకలాపాల నుండి వినియోగదారుల సాధికారత, విశ్వాసం, రక్షణను పెంపొందించడం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలపై పరిశ్రమ ప్రతినిధులతో ఒక సెషన్ కూడా జరిగింది. ఈ సందర్భంగా... వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడానికి, డిజిటల్ కమ్యూనికేషన్ పర్యావరణ వ్యవస్థ సమగ్రతను పెంచడానికి చర్చలు దృష్టి సారించాయి.
కాగా... సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఏడాది జూన్ లో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బ్యాంకు సంబంధిత లావాదేవీలు, సేవలకు సంబంధించి ఇకపై +91-1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే కాల్స్ చేయనున్నట్లు తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మోసాల పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్న వేళ ఈ నిర్ణయం ప్రకటించింది.
కస్టమర్లకు 1600 సిరీస్ తో మొదలయ్యే నంబర్ల నుంచే కాల్ చేయాలంటూ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరిలో సూచించిన సంగతి తెలిసిందే. ఒకవేళ మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ కోసమైతే 1400 సిరీస్ ను వినియోగించాలని తెలిపింది. దీనివల్ల ఏది నమ్మదగినది, ఏది మోసపూరితమైన కాల్ అనేది తెలుసుకోవడానికి సాధ్యమవుతుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ రంగాలలో 1600-సిరీస్ నంబరింగ్ ప్లాన్ కు షిఫ్ట్ అవ్వడం కోసం దశలవారీ సన్ సెట్ టైమ్ లైన్ పై జేఓసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తాజా ప్రభుత్వ ప్రకటనలో సన్ సెట్టింగ్ మైగ్రేషన్ కోసం కాలక్రమంపై వివరాలు మాత్రం లేవు.