పరకామణి చోరీ కేసులో న్యాయ విచారణ చేయాల్సిందే !
ఇదిలా ఉంటే రవికుమార్ ఆస్తులు వంద కోట్ల దాకా వంద కోట్లకు పైగా ఉన్నాయని అంటున్నారని అన్ని కోట్లకు అధిపతిగా ఉంటూ గుమాస్తాగా పనిచేయడమేంటి అని ఎల్వీ ప్రశ్నించారు.;
కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రపంచవ్యాప్తంగా భక్తుల విశ్వాసం చూరగొంటున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను కాపాడలేకపోతున్నారు అని ఆస్తిక జనులు అంటున్నారు. రెండున్నరేళ్ల క్రితం పరకామణిలో జరిగిన దొంగతనం అనంతర పరిణామాలు మీద విశ్రాంత న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం అంటున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరకామణిలో చోరీ ఘటన మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆనాడు ఏమి జరిగింది :
ఇక వెనక్కి వెళ్తే 2023 ఏప్రిల్ 29న రవి కుమార్ అనే పెద్ద జియ్యంగారు కార్యాలయానికి చెందిన ఒక గుమాస్తా పరకామణి లెక్కింపు విధులకు వచ్చి 900 డాలర్లను చోరీ చేశారని అన్నారు. అయితే దాని మీద విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ రవి కుమార్ దొంగతనం చేసిన దాన్ని చూసి పట్టుకున్నారని చెప్పారు. ఇక మే 19న తనకు ఉన్న ఆస్తులను శ్రీవారికి దానంగా ఇస్తాను అని రవి కుమార్ ప్రకటించారని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. అయితే ఎవరైనా తమ ఆస్తులను దానంగా ఇవ్వాలనుకుంటే తమ ఆస్తుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని పత్రికా ప్రకటన చేసి ఆ మీదట ఇవ్వాలని అన్నారు. కానీ అంతా హడావుడిగా చేశారని అన్నారు. పైగా రవికుమార్ దొంగిలించినది 70 వేలు అయితే ఏకంగా 14 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా దానం ఇస్తారో కూడా అర్ధం కాని విషయం అన్నారు. ఇదంతా టీటీడీ బోర్డు అంగీకారంతోనే జరిగిందని అన్నారు.
పోలీసుల ఒత్తిడితో :
ఇక ఈ ఘటన తరువాత విజిలెన్స్ అధికారి సతీష్ చోరీ చేసిన రవికుమార్ లోక్ అదాలత్ కి వెళ్ళారని తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని అనుమతి అక్కడ తీసుకున్నారని ఎల్వీ వెల్లడించారు. ఆ మీదట సతీష్ మాట్లాడుతూ పోలీసుల ఒత్తిడితోనే ఈ విషయంలో రాజీకి అంగీకరించామని చెబుతున్నారని అన్నారు. ఇవన్నీ చూస్తూంటే శ్రీవారి ఆస్తుల విషయంలో కానీ పరకామణి చోరీ ఘటనలో కానీ ఎక్కడా పారదర్శకత కానీ సరైన విచారణ కానీ జరగలేదని అర్ధం అవుతోందని ఎల్వీ అన్నారు.
ఈ మార్పుల వల్ల :
ఇక పరకామణి లెక్కింపు విషయంలో 2012లో మార్పులు తెచ్చారని సిబ్బంది కొరత అని చెప్పి ఇతర విధుల్లో ఉన్న వారిని కూడా తెచ్చి లెక్కిస్తున్నారని దాంతో ఏమి జరుగుతోందో తెలియకుండా పోతోంది అన్నారు. నిబద్ధత కూడా లేని వాతావరణం ఉందని అన్నారు. నిజానికి పరకామణి లెక్కింపుకు వెళ్ళే వారు ఒంటి మీద ఏమీ లేకుండా చూసుకుంటారని తమ ఒంటి మీద ఏమి ఉన్నా స్వామి హుండీలోనే వేస్తారు అని అన్నారు. అయితే ఇతర విభాగాలను తేవడం వల్లనే పరకామణి లెక్కింపులో పారదర్శకత అన్నది లేకుండా పోతోంది అని అన్నారు.
వంద కోట్ల అధిపతి గుమాస్తాగా :
ఇదిలా ఉంటే రవికుమార్ ఆస్తులు వంద కోట్ల దాకా వంద కోట్లకు పైగా ఉన్నాయని అంటున్నారని అన్ని కోట్లకు అధిపతిగా ఉంటూ గుమాస్తాగా పనిచేయడమేంటి అని ఎల్వీ ప్రశ్నించారు. ఇక డబ్బు లెక్కించే స్థానంలో లేని రవి కుమార్ వద్దకు 900 డాలర్లు ఎలా వచ్చి చేరాయని ఆయన ప్రశ్నించారు. ఎవరో తెర వెనక సాయం లేకపోతే ఇంతలా ఆయనకు ఆ డాలర్లు చేరేది ఉండదని అన్నారు.
శిక్షించాల్సిందే :
పవిత్రమైన శ్రీవారి ఆలయంలో చేసిన దొంగతనానికి శిక్ష పడాలని కానీ రాజీ చేయడం కంటే నీచమైనది మరొకటి లేదని పట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా మొత్తం కేసుని న్యాయ విచారణకు అప్పగించి పూర్తిగా మరోసారి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రవి కుమార్ ని శిక్షించాల్సిందే అన్నారు. ఎంతో మంది నిరుపేద భక్తులు కూడా స్వామి వారికి విరాళంగా ఇస్తారని అలాంటిది భక్తుల విశ్వాసం దెబ్బ తీసే చర్యలను క్షమార్హం కావని ఆయన అన్నారు.
మరోసారి విచారణ :
శ్రీవారి పరకామణి చోరీ కేసు విషయం మరోసారి విచారణ జరిపించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఒక సాధారణ గుమాస్తాకు 14 కోట్ల ఆస్తిని విరాళంగా ఇవ్వడానికి ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. స్వామి సన్నిధిలో 20 ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి చోరీ చేశారు అంటే నమ్మకద్రోహం కింద కేసు పెట్టి శిక్షించాలని ఆయన అన్నారు. టీటీడీ బోర్డులో నేస్థులకు చోటు లేకుండా చూడాలని భక్తులను దేవుడిని నమ్మకంగా కొలిచే వారికే అవకాశం ఇవ్వాలని మాజీ జేడీ అన్నారు.