తిరుచ్చిలో హైవోల్టేజ్ పోరు.. స్టాలిన్ వర్సెస్ త్రిష? తమిళ రాజకీయాల్లో సూపర్ వార్!
తిరుచ్చిలో మాజీ సీఎం స్టాలిన్, గ్లామర్ క్వీన్ త్రిష పోటీ చేయనున్నారని ప్రచారం చాలా ఉధృతంగా సాగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలన పోరుకు రంగం సిద్ధం అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి ఇద్దరు ఉద్దండులు పోటీకి రెడీ అవుతున్నారనే సమాచారం హైవోల్టేజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే అధినేత, దళపతి విజయ్ కి సవాల్ విసిరేందుకు డీఎంకే సై అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ముఖ్యమంత్రి విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. ఈ స్థానం నుంచి టీవీకే పార్టీ తరఫున ముఖ్యమంత్రి విజయ్ కి అత్యంత సన్నిహితురాలు, గ్లామర్ క్లీన్ త్రిష పోటీ చేయనున్నారని అంటున్నారు. ఇక త్రిషకు ప్రత్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేయాలని డీఎంకే శ్రేణులు కోరుతున్నాయి.
తిరుచ్చిలో మాజీ సీఎం స్టాలిన్, గ్లామర్ క్వీన్ త్రిష పోటీ చేయనున్నారని ప్రచారం చాలా ఉధృతంగా సాగుతోంది. అదే జరిగితే ద్రవిడ రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లో హైవోల్టేజ్ ఫైట్ జరగడం ఖాయమంటున్నారు. ముఖ్యమంత్రి విజయ్ కి అత్యంత సన్నిహితురాలిగా త్రిష తమిళ రాజకీయాలను ఆకర్షిస్తున్నారు. ఆమెకు ఉన్న సినీ గ్లామర్ కారణంగా యావత్ దేశం త్రిష పొలిటికల్ ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నారు. పదేళ్ల క్రితమే తాను ముఖ్యమంత్రి అవుతానంటూ గతంలో త్రిష వ్యాఖ్యానించడం తాజాగా వైరల్ అయింది. ఇక ఎన్నికలకు ముందు ఆమె విజయ్ పార్టీ తరఫున పోటీచేస్తారని, ప్రచారం చేస్తారని రకరకాల ప్రచారం జరిగింది. కానీ, త్రిష ఎన్నికల ముందు టీవీకేకి మద్దతు ప్రకటించడం వరకే పరిమితమయ్యారు.
ఇక ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో హాజరైన త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు విజయ్ ఖాళీ చేసిన స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. త్రిష పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడకనే అన్న అంచనాల మధ్య డీఎంకేలో అనూహ్య డిమాండ్ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తిరుచ్చి ఈస్ట్ లో పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. స్టాలిన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని తిరుచ్చి జిల్లా డీఎంకే పార్టీ నేతలు తాజాగా తీర్మానం చేశారు.
దీంతో తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణుల పిలుపు మేరకు స్టాలిన్ తిరుచ్చిలో పోటీ చేయడానికి సిద్ధమవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. తాను పోరాట యోధుడిని అని నిరూపించుకునేందుకు డీఎంకే బాస్ సిద్ధమైతే తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తిరుచ్చి ఈస్ట్ కోసం టీవీకేలోనూ తీవ్రమైన పోటీ కనిపిస్తోందని అంటున్నారు. ప్రధానంగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందున తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి తమకు వదిలేయాలని మిత్రపక్షం వీసీకే చీఫ్ తిరుమావళవన్ కోరుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. తిరుచ్చి ఈస్ట్ లో తన పార్టీ తరఫున త్రిషకు అవకాశం ఇస్తారా? లేదా? అనేది చూడాల్సివుంది. విజయ్, త్రిష సంబంధాలపై ఎన్నికల ముందే ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ, ప్రజలు వాటిని తిరస్కరిస్తూ విజయ్ కి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో త్రిషకు చట్టసభలలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తే, ప్రభుత్వ పాలనలోనూ తనకు చేదుడుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఏదిఏమైనప్పటికీ తిరుచ్చిలో ఒకవైపు స్టాలిన్, మరోవైపు త్రిష పోటీ చేస్తారనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా సాగుతున్నాయి.