మధ్యవర్తిత్వానికి నో.. ట్రంప్, జిన్ పింగ్ లకు థాయ్ లాండ్ ఐరన్ లేడి
థాయ్‌లాండ్ ప్రధాని కాంబోడియాతో కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలో గట్టి వైఖరి తీసుకున్నారు. భారత్ వైఖరిని స్పూర్తిగా తీసుకొని అగ్రదేశాలకు షాకిచ్చారు.;
థాయ్‌లాండ్ ప్రధాని కాంబోడియాతో కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలో గట్టి వైఖరి తీసుకున్నారు. భారత్ వైఖరిని స్పూర్తిగా తీసుకొని అగ్రదేశాలకు షాకిచ్చారు. అమెరికా, చైనా, మలేషియా దేశాల మధ్యవర్తిత్వ ఆఫర్లను ఆమె స్పష్టంగా తిరస్కరించారు. ఈ సమస్యను నేరుగా రెండు దేశాల మధ్యే పరిష్కరించుకోవాలని.. ఇతర దేశాల జోక్యం అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు.
ఇటీవలి రోజుల్లో థాయ్–కాంబోడియా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారీ ఆర్టిలరీ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్‌తో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోగా, 1.3 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సహాయక సంస్థలు మానవతా సంక్షోభం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నాయి.
అంతర్జాతీయ వేదికల నుంచి వస్తున్న ఒత్తిడి మధ్య కూడా థాయ్‌లాండ్ వెనకడుగు వేయడం లేదు. "ఇది థాయ్‌లాండ్ - కాంబోడియా మధ్య సమస్య. మేము మా సార్వభౌమత్వాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నాం. అర్థవంతమైన చర్చలు జరగాలంటే ముందు కాంబోడియా దాడులు ఆపాలి" అని ప్రధాని స్పష్టం చేశారు.
పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఘర్షణ మరింత వేడెక్కితే పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి దక్షిణాసియా ప్రాంత స్థిరత్వానికే ముప్పు తెస్తుంది.
ప్రధాని వైఖరిని కొందరు ప్రమాదకరమైనదిగా, మరికొందరు ధైర్యసాహసాలతో నిండినదిగా చెబుతున్నారు. అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల ఆఫర్లను తిరస్కరించడం ద్వారా ఆమె అంతర్జాతీయ వేదికపై ధైర్యవంతురాలిగా పేరు తెచ్చుకున్నారు. స్థానిక మీడియాలో ఆమెను "హీల్స్‌లో ఇనుప మనసున్న రాణి" అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక సరిహద్దులో తూటాలు, బాంబులు ఆగే సూచనలు లేకపోవడంతో ప్రజలు భయాందోళనలో రోజులు గడుపుతున్నారు. థాయ్‌లాండ్ గట్టి వైఖరి చివరికి శాంతి చర్చలకు దారి తీస్తుందా? లేక మరింత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.