శివాలయం కోసం యుద్ధం... థాయ్ - కాంబోడియా వివాదం తెలుసా?
వీటిల్లో సుమారు 1,000 సంవత్సరాల పురాతనమైన ప్రీహ్ విహార్ అత్యంత కీలకమైన విషయం అని చెబుతారు. ఇది ఒక శివాలయం!;
నిన్నటివరకూ ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధంలో పశ్చిమాసియా రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇజ్రాయెల్ - పాలస్తీనా - సిరియా మధ్య యుద్ధం విస్తరిస్తూనే ఉంది! ఈ క్రమంలో తాజాగా ఆగ్నేయాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. థాయిలాండ్ - కాంబోడియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అసలు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దామ్..!
అవును... థాయ్ - కంబోడియా దళాల మధ్య వారి వివాదాస్పద సరిహద్దు వద్ద మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణల్లో 12 మంది మరణించారని థాయ్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది థాయ్ ప్రావిన్సులకు చెందినవారు ఉన్నారని థాయిలాండ్ సైన్యం తెలిపింది. అనేక మంది గాయపడ్డారని చెప్పింది. కంబోడియా తమకు ఏమైనా నష్టం జరిగిందా లేదా అనేది వెల్లడించలేదు!
అసలు ఏమిటీ వివాదం?:
సుమారు 817 కిలోమీటర్ల పెద్ద సరిహద్దును పంచుకుంటున్న ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతం కీలకంగా మారింది. ఈ వివాదం ఇప్పటిది కాదు.. సుమారు శతాబ్ధానికి పైగా చరిత్ర ఉన్న సమస్య. దీనికోసమే ఇరుదేశాల మధ్య పోరాటం జరుగుతోంది.
వీటిల్లో సుమారు 1,000 సంవత్సరాల పురాతనమైన ప్రీహ్ విహార్ అత్యంత కీలకమైన విషయం అని చెబుతారు. ఇది ఒక శివాలయం! ఈ ఆలయం ఉన్న డాంగ్రెక్ పర్వతాల శిఖరం థాయిలాండ్ కు అత్యంత సమీపంలో ఉంటుంది. అయితే... ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
అయినప్పటికీ సరిహద్దుల్లో తగాదాలు ఆగలేదు! ఈ నేపథ్యంలో 2008లో కంబోడియా విజ్ఞప్తి మేరకు ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే... ఈ నిర్ణయాన్ని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది 2008-11 మధ్య పలు సార్లు ఘర్షణలకు దారితీసింది. ఈ క్రమంలో... 2011లో దాదాపు డజను మంది ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం... ప్రీహ్ విహార్ పరిసరాల్లో కంబోడియా సార్వభౌమత్వం ఉందని.. థాయ్ దళాలు వైదొలగాలని కోరుతూ కొన్నేళ్ల ముందు అంతర్జతీయ న్యాయస్థానం మరో తీర్పు ఇచ్చింది. దీంతో.. సరికొత్త అగ్గి రాజుకుంది. దీనికి థాయ్ అంగీకరించినా.. మ్యాప్ లు, మిలిటరీ గస్తీలపై వివాదం మొదలైంది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలో ఓ కంబోడియా సైనికుడు మృతి చెందాడు.
ఇదికాస్తా.. పినోమ్ పెన్ లో జాతీయవాద సెంటిమెంట్ ను ఎగదోసింది. ఫలితంగా... అధికారం చేపట్టిన పది నెలలకే థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు పదవీగండం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ తో మాట్లాడిన ఫోన్ కాల్ లీకైంది. ఇందులో ఆమె.. అంకుల్ అంటూ ఆయనను సంబోధించింది. దీంతో.. ఆమె పదవిని కోల్పోయారు.
ఈ క్రమంలో... తాజాగా మొదలైన వివాదం ముదరడంతో థాయ్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు రంగంలోకి దిగి ట మోన్ థోమ్ ఆలయ ప్రదేశంలో బాంబింగ్ చేశాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సరిహద్దుకు సమీపంలో ఉన్న తమ పౌరులను ఆ ప్రాంతాలను విడిచిపెట్టమని రెండు దేశాలు కోరాయి. ఈ సమయంలో థాయ్ 40,000 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఈ సందర్భంగా స్పందించిన థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్... చర్చలు జరగాలంటే ముందుగా థాయిలాండ్ - కంబోడియా మధ్య పోరాటం ఆగిపోవాలని అన్నారు. ఇదే క్రమంలో... కంబోడియా ఎటువంటి నిర్దిష్ట లక్ష్యాలు లేకుండా థాయిలాండ్ లోకి భారీ ఆయుధాలను ప్రయోగించిందని, ఫలితంగా పౌరులు మరణించారని అన్నారు!