ఇద్దరు పిల్లల నిబంధన : గ్రామీణ రాజకీయాల్లో కొత్త మలుపు..
ఈ చట్ట సవరణతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు (ఎంపీటీసీ), , జిల్లా పరిషత్తు (జడ్పీటీసీ ) ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు పెద్ద ఊరట లభించింది.;
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా అభ్యర్థుల అర్హతను శాసిస్తున్న ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–21కు సవరణ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభతో పాటు, తాజాగా శాసన మండలి కూడా ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయం చట్టబద్ధత సంతరించుకుంది.
నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు
ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే కాకుండా విస్తృతమైన సామాజిక, రాజకీయ కోణాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను కఠినంగా పాటిస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కుటుంబ నియంత్రణ విజయవంతం కావడం వల్ల తెలంగాణలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో యువశక్తి తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగే ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తోంది.ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నారనే కారణంతో సమర్థులైన నాయకులు గ్రామీణ రాజకీయాలకు దూరం కాకూడదనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
స్థానిక సంస్థలపై ప్రభావం
ఈ చట్ట సవరణతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు (ఎంపీటీసీ), , జిల్లా పరిషత్తు (జడ్పీటీసీ ) ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు పెద్ద ఊరట లభించింది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పోటీకి అనర్హులు.. ఇప్పుడు పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా పోటీ చేయవచ్చు. యువ నాయకత్వానికి అడ్డంకులు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం పెరుగుతుంది.
ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బలమైన ప్రభావం చూపనుంది. ముఖ్యంగా గ్రామాల్లో పట్టున్న పాత తరం నేతలతో పాటు సామాజిక సమీకరణాల వల్ల ఇన్నాళ్లూ వెనుకబడిన నేతలకు ఇప్పుడు మార్గం సుగమమైంది. మారుతున్న సామాజిక పరిస్థితులు, అభివృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జనాభా విధానంలో సమతుల్యత అవసరం. అందుకే ఈ నిబంధనను తొలగించాం అని మంత్రి సీతక్క తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా జనాభా నియంత్రణ పట్ల రాష్ట్ర వైఖరిలో వచ్చిన మార్పుగా చూడవచ్చు. అటు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకుంటూనే ఇటు స్థానిక ప్రజాస్వామ్యంలో గరిష్టంగా ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ అడుగు పడింది. రాబోయే ఎన్నికల్లో ఈ మార్పు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.