'రాజా' చెయ్యి వేస్తే.. టీడీపీలో తెగ గుసగుస ..!
ఇది సొంత పార్టీ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఆయనను బయటకు ఏమీ అనలేరు. అలా అని అంతర్గతంగా కూడా దాచి పెట్టుకోలేరు.;
'రాజా చెయ్యి వేస్తే రాంగ్ అయి పోదులే రా' అనే పాట పాత సినిమాల్లో మనకు వినిపిస్తుంది, అచ్చం ఇప్పుడు ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కృష్ణాజిల్లాలలో ఇదే పాట కూటమి నాయకులు పాడుకుంటూ ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి నాయకుల్లో ఉన్న ఒక కీలక నేత అటు అనంతపురం, కర్నూలు అదేవిధంగా కృష్ణాజిల్లాలో చక్రం తిప్పుతున్నారు అనేది టిడిపి సీనియర్ నాయకుల్లో గుసగుస వినిపిస్తోంది. గనుల వ్యాపారంలో ఉన్న ఆ రాజా ఈ మూడు జిల్లాల్లో చెలరేగిపోతున్నారనేది సీనియర్లు చెబుతున్న మాట. అందరికీ తెలిసిన నాయకుడేనని, అయితే ఆయన ఈ మూడు జిల్లాల్లో తన హవాను ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న కొంతమేరకు ఇట్లాంటి పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ రాజా విషయంలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి కారణం ఉంది. అది ఏంటంటే.. సాధారణంగా కాంట్రాక్టులు తీసుకున్నా.. కాంట్రాక్టులు చేసినా.. తమవారికి ప్రాధాన్యమిస్తారు. లేకపోతే తమ పార్టీ అనుచరులకు అవకాశం కల్పిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేది. కానీ చిత్రంగా ఈ రాజా మాత్రం తన పార్టీ నాయకుల కంటే తన పార్టీ అనుకూలరికంటే పొరుగు పార్టీల నాయకులకు, వైసిపి కి అనుబంధంగా ఉన్న వ్యక్తులకు ఈయన కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నారు.
ఇది సొంత పార్టీ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఆయనను బయటకు ఏమీ అనలేరు. అలా అని అంతర్గతంగా కూడా దాచి పెట్టుకోలేరు. ''ఆ రాజా గారి పరిస్థితి మమ్మల్ని బాధిస్తోంది మా వాళ్ళు ఇంతమంది ఉండగా మమ్మల్ని వదిలేసి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడమేంటి'' అని సీనియర్ నాయకులు అంతర్గత చర్చల్లో.. మీడియా ముందు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎవరూ నేరుగా ఆయన పేరుపెట్టి విమర్శించలేరు. చంద్రబాబు దగ్గర ఫిర్యాదు కూడా చేయలేని పరిస్థితి. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి పలుకుబడి ఉండడం గమనార్హం.
గత ఎన్నికల్లో నాలుగైదు జిల్లాలకు ఆయన ఫండింగ్ చేశారన్న ప్రచారం కూడా ఉండడంతో ఆయనను ఏమీ అనలేని పరిస్థితి. పైగా నారా లోకేష్ కు ఆయన అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది. దీనంతటికీ కారణం ఆయనకు కాంట్రాక్టులు ఇస్తున్నారని గాని ఆయన ఏదో పది రూపాయలు సంపాదించుకుంటున్నారని గానీ నాయకుల ఆవేదన కాదు. సొంత పార్టీ నాయకులైన తమకు అవకాశం ఇవ్వడం లేదని, పొరుగు పార్టీలకు చెందిన ప్రతిపక్షాలకు చెందిన వారికి అవకాశం కల్పిస్తున్నారనేదే వీరి ఆవేదనగా ఉంది. దీనిపై అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోవాలని, తమకు కూడా అవకాశం కల్పించాలని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తాము కూడా పుంజుకోవాలని కొంతమంది నాయకులు అంతర్గతంగా చంద్రబాబుకు విన్నవిస్తున్నారు. మరి ఆ నాయకుడు ఎవరు? ఆయన చేస్తున్న పనులేమిటి అనేది పార్టీ అధిష్టానం దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుకుంటున్నారు.