లాలూ కొడుకుకు పట్టాభిషేకం...లోకేష్ వైపు చూపు !
ఈ నేపధ్యంలో బీహార్ లో ఆర్జేడీ పార్టీ సారధ్య బాధ్యతలను తమ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కి ప్పగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయించారు.;
దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కుటుంబ పార్టీలు అని బీజేపీ తరచూ విమర్శలు చేస్తుంది. అందులో ఎంతో నిజం ఉంది. కుటుంబ సభ్యులే ఆ పార్టీలకు వారసులుగా భావి నేతలుగా మారుతారు. సమాజ్ వాదీ పార్టీకి ములాయం సింగ్ యాదవ్ తరువాత అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడు అయ్యారు, సీఎం గా కూడా పనిచేశారు. అలాగే శివసేనకు బాల్ ఠాక్రే తరువాత ఉద్ధవ్ థాకరే సారధి అయ్యారు. దక్షిణాన చూసుకుంటే జేడీఎస్ అధినేత దేవేగౌడ పార్టీకి కుమారుడు కుమార స్వామి అధినేతగా ఉంటున్నారు. ఆయన కుమారుడు కూడా లైన్ లో ఉన్నారు, తమిళనాడులో డీఎంకేకి కరుణానిధి, ఆ తరువాత స్టాలిన్, ఇపుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ కి కేసీఆర్ ప్రెసిడెంట్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. కీలక బాధ్యతలలో మేనల్లుడు హరీష్ రావు ఉన్నారు.
లాలూ వారసత్వం :
ఈ నేపధ్యంలో బీహార్ లో ఆర్జేడీ పార్టీ సారధ్య బాధ్యతలను తమ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కి ప్పగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయించారు. ఎనిమిది పదుల వయసు దాటిన లాలూ వయోభారంతో పార్టీ మీద ఫోకస్ తగ్గించాలని అనుకుంటున్నారు. దాంతో తేజస్విని ఆర్జేడీ జాతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తూ మొత్తం పగ్గాలు ఆయన చేతిలోనే పెట్టనున్నారని అంటున్నారు. ఈ నెలాఖరులో జరిగే ఆర్జేడీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఈ పట్టాభిషేకం జరుగుతుందని చెబుతున్నారు. ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక నేతలు అంతా ఈ సమావేశానికి హాజరై తేజస్వి యాదవ్ పట్టాభిషేకానికి ఆమోదముద్ర వేస్తారు అని అంటున్నారు.
లోకేష్ మీద ఫోకస్ :
నారా లోకేష్ ఏపీలో టీడీపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. ఈ ఏడాది మేలో జరిగే టీడీపీ మహానాడులో లోకేష్ కి ప్రమోషన్ పార్టీ పరంగా దక్కుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. గతంలో చూస్తే లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తమ్ముళ్ల నుంచి డిమాండ్ వచ్చింది. అయితే అది అప్రస్తుతం అని టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టేశారు. అయితే పార్టీలో లోకేష్ పాత్రను మరింతగా పెంచేందుకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. దాంతో ఈసారి కచ్చితంగా లోకేష్ కి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కుతుందని అంటున్నారు. 2029 ఎన్నికలు టీడీపీకి చాలా కీలకంగా మారుతున్నాయి.
ప్రమోషన్ అవసరం :
ఈ ఎన్నికల్లో మరోసారి గెలవాలని టీడీపీ భారీ స్కెచ్ తో ముందుకు సాగుతోంది. గెలిచిన పక్షంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ భారీ మార్పులు వస్తాయని అంటున్నారు. దాని కంటే ముందు పార్టీ పరంగా లోకేష్ కి ప్రమోషన్ అవసరం అన్నది అయితే ఉంది. ఇక దేశంలో వారసులు అందరికీ ప్రమోషన్లు వరసబెట్టి లభిస్తున్నాయి. స్టాలిన్ కుమారుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఏడాది ఎన్నికల్లో డీఎంకే మరోసారి గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అని వినిపిస్తోంది. బీహార్ లో కూడా ఆర్జేడీ గెలిచి ఉంటే తేజస్వి యాదవ్ సీఎం అయ్యేవారు. దాంతో లోకేష్ విషయంలోనూ పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి టీడీపీ అధినాయకత్వం వైఖరి ఎలా ఉందో.