14 తీర్మానాలు-6 నిర్ణయాలు.. మహానాడు భారీ అజెండా..!
మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న టీడీపీ పసుపు పండుగ మహానాడుపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. పార్టీ నాయకులు దాదాపు ఇప్పటికే అనేక మార్గాల ద్వారా.. మహానాడు వేదికకు చేరుకుంటున్నారు.;
మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న టీడీపీ పసుపు పండుగ మహానాడుపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. పార్టీ నాయకులు దాదాపు ఇప్పటికే అనేక మార్గాల ద్వారా.. మహానాడు వేదికకు చేరుకుంటున్నారు. మంగళవా రం, బుధవారం, గురువారం మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడు పార్టీకి దశ-దిశ చూపించడమే కాకుండా.. యువతకు కూడా పెద్ద పీట వేయనుంది. మరీ ముఖ్యంగా ఈ సారి మహిళలకు మరింత దన్నుగా పార్టీ మారనుంది.
ఈ క్రమంలోనే గతంలో ఎప్పుడూ లేనట్టుగా.. ఈ సారి 14 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. నిజానికి మహానాడు అంటే.. ఏడు లేదా 8 తీర్మానాల వరకే పరిమితం అయ్యేది. కానీ.. ఈ సారి మాత్రం 14 తీర్మా నాలను ప్రతిపాదించారు. దీనిని బట్టే.. పార్టీ భవిష్యత్తును ఊహించుకోవచ్చని తీర్మానాల కమిటీకి చైర్మన్‌గా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. అంటే.. పార్టీని వచ్చే 30 నుంచి 40 ఏళ్ల పాటు పదిలంగా కాపాడుకునే కార్యక్రమానికి నేటి మహానాడు బీజం వేయనుంది.
ప్రధానంగా యువతకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేందుకు తీర్మానం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కొమ్ముకాచే యువతకు.. పదవులు.. ప్రాధాన్యాలను పెంచనున్నారు. ఇది పార్టీకి మేలిమలుపుగా మారనుం ది. అదే సమయంలో గుజరాత్ తరహాలో రాష్ట్రంలో ఒకే పార్టీ లేదా కూటమి ఎక్కువ కాలం అధికారంలో ఉంటే ఒనగూరే ప్రయోజనాలను కూడా వివరించనున్నారు. దీనిపై కూడా మరో తీర్మానం చేయనున్నారు. అలాగే.. వైసీపీపై ప్రధానంగా చర్చించేందుకు మూడు నుంచి 4 గంటల సమయం కేటాయించనున్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్ర భ్రష్టు పట్టిన తీరును.. వ్యవస్థల కుదేలు.. అప్పులు.. మద్యం, ఇసుక, ఇలా.. అనేక అంశాలను ప్రస్తావించి.. వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాలన్న మరో తీర్మానం కూడా ఉంది. ఇక, ఈ 14 తీర్మానాలతో పాటు.. మరో 6 కీలక అంశాలను కూడా ప్రకటిస్తారు. ఇవి పూర్తిగా నారా లోకేష్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నవేనని.. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. వీటినే టీడీపీ-సూపర్ సిక్స్‌గా అభివర్ణించారు. ఇతర కార్యక్రమాలు ఎలా ఉన్నా.. ఈ 14 తీర్మానాలు, ఆ ఆరు అంశాలు మహానాడును హైలెట్ చేస్తాయని అంటున్నారు.