జవసత్వానికే టీడీపీ పెద్ద పీట

తెలుగుదేశం పార్టీ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తోంది. అదే క్రమంలో పార్టీలో సీనియర్లు గా ఉన్న వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ రాజకీయాల్లో ఆసక్తిగా ఉంటే వారికి కూడా అవకాశాలు కల్పిస్తోంది.;

Update: 2026-04-16 03:41 GMT

తెలుగుదేశం పార్టీ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తోంది. అదే క్రమంలో పార్టీలో సీనియర్లు గా ఉన్న వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ రాజకీయాల్లో ఆసక్తిగా ఉంటే వారికి కూడా అవకాశాలు కల్పిస్తోంది. అయితే కేవలం వారసత్వంతో పదవులు అందుకుంటామంటే అది టీడీపీలో కుదరదు అన్నది తాజాగా ఆ పార్టీ ప్రకటించిన జాతీయ రాష్ట్ర కమిటీలను చూస్తే అర్ధం అవుతోంది అని అంటున్నారు. వారసత్వం అన్నది ఎంట్రీ కార్డు మాత్రమే అని ఆ మీదట పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి జనంలో ఉంటూ వారి ఆదరణను సంపాదించుకున్న వారికే పార్టీ ప్రోత్సహించి పెద్ద పీట వేస్తుందన్న సందేశం తాజాగా పార్టీ పదవుల పందేరంలో ఉందని గుర్తు చేస్తున్నారు.

కష్టించిన వారికే గుర్తింపు :

ఉత్తరాంధ్రా జిల్లాలలో చూసుకుంటే దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు 2014లో తొలిసారి ఎంట్రీ ఇచ్చి ఆ మీదట వరసగా మూడు సార్లు అదే శ్రీకాకుళం లోక్ సభ సీటు నుంచి గెలిచి హ్యాట్రిక్ ఎంపీ అయ్యారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన సేవలను పార్టీ గుర్తిస్తూ అన్ని రకాలుగా ప్రమోషన్స్ ఇస్తోంది. తాజాగా ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి పార్టీలో అందలం దక్కింది. దాంతో రామ్మోహన్ నాయుడు వారసత్వంతో కాదు తన సత్తాతోనే ఈ స్థాయిని అందుకున్నారు అన్న సంకేతాన్ని పార్టీ తానుగా ఇచ్చినట్లు అయింది అంటున్నారు.

వీరంతా అదే రూట్లో :

కేవలం రామ్మోహన్ మాత్రమే కాదు అదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌతు కుటుంబ వారసురాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకి కూడా రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కీలమైన అవకాశం దక్కింది. ఆమె తాత గౌతు లచ్చన్న సర్దార్ బిరుదుతో పాటు బీసీల పెన్నిధిగా ఉన్నారు. అలాగే ఆమె తండ్రి శివాజి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి వారసత్వంతో వచ్చినా శిరీష పార్టీ కోసం కష్టపడుతూ జనంతో ఉంటూ వస్తున్నారు. పలాసలో పార్టీని పటిష్టం చేశారు దాంతోనే ఆమెకు ఈ గౌరవం గుర్తింపు లభించాయని అంటున్నారు;

జూనియర్ అయ్యనకు చాన్స్ :

అదే విధంగా పార్టీలో మరో కీలక నాయకుడు అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఆయన నర్శీపట్నంలో తన బలాన్ని చూపుతున్నారు. పార్టీని అక్కడ గట్టిగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తెగా రాజకీయ ప్రవేశం చేసినా తనకంటూ ఒక స్థానన్ని టీడీపీలో సాధించిన కావలి గ్రీష్మకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల జాబితాలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు కుమారుడికి చోటు కల్పించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ కి ఈ పదవి లభించింది. ఇక అనేక మంది మాజీ మంత్రులు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారి వారసుల విషయంలో పార్టీలో ఇంకా బాగా పనిచేయమని సందేశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పనిచేస్తేనే పదవులు అన్నది టీడీపీ విధానంగా ఉందని చెబుతున్నారు. అందుకే కొత్తగా పార్టీలో ఉన్న అనేక మందికి ఏ రాజకీయ వారసత్వం లేని వారికి కూడా కీలక పదవులు దక్కాయని స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News