అమెరికన్లు ఉండగా.. విదేశీయులతో ఉద్యోగాల భర్తీనా? టీసీఎస్ కు సెనేటర్ల షాక్
సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్ చక్ గ్రాస్లీ , ర్యాంకింగ్ మెంబర్ డిక్ డర్బిన్ సంయుక్తంగా టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్‌కు లేఖ రాశారు.;
వలస విధానాలు కఠినమవుతున్న నేపథ్యంలో భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అమెరికాలో తమ నియామక విధానాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ అమెరికా సెనేటర్ల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్ చక్ గ్రాస్లీ , ర్యాంకింగ్ మెంబర్ డిక్ డర్బిన్ సంయుక్తంగా టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్‌కు లేఖ రాశారు.
సెనేటర్ల లేఖలో ముఖ్య ప్రశ్నలు
టీసీఎస్ అమెరికాలో అనుసరిస్తున్న నియామక ప్రక్రియపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ ఇద్దరు సెనేటర్లు మొత్తం తొమ్మిది ప్రశ్నలు సంధించారు. వాటిలో ప్రధానమైనవి. అమెరికన్ కార్మికులను H-1B వీసా హోల్డర్లతో భర్తీ చేశారా? H-1B వీసా ఉద్యోగులకు సరైన వేతనాలు చెల్లిస్తున్నారా? అమెరికన్ సిబ్బందికి, H-1B వీసాదారులకు చెల్లించే వేతనాలు సమానంగా ఉన్నాయా? కంపెనీ లోపల ఉద్యోగ ప్రకటనలు పారదర్శకంగా ఉంటున్నాయా? ముఖ్యంగా H-1B నియామక ప్రకటనలను సాధారణ ప్రకటనల నుంచి దాచిపెడుతున్నారా? ఒకవైపు అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ (లేఆఫ్‌లు) వేల మంది విదేశీ ఉద్యోగుల కోసం H-1B వీసా దరఖాస్తులు ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
సెనేటర్లు తమ లేఖలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.
H-1B వీసాల దరఖాస్తు: టీసీఎస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,505 H-1B వీసాల కోసం దరఖాస్తు చేసి ఆమోదం పొందిందని వారు గుర్తుచేశారు.
లేఆఫ్‌లు: అదే సమయంలో టీసీఎస్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న తమ ఉద్యోగుల్లో సుమారు 12 వేలమందిని తొలగించే ప్రణాళికలు రూపొందిస్తోందని, అందులో అమెరికన్ ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉదాహరణకు జాక్సన్‌విల్లే కార్యాలయంలోనే సుమారు 60 మందిని ఇటీవల తొలగించారు.
వివక్ష ఆరోపణలు: పెద్దవయసు ఉన్న అమెరికన్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును కూడా వారు ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.
అమెరికన్లకంటే వలసదారులు ఎందుకు? అనే ప్రశ్నతో ప్రారంభమైన ఈ లేఖకు టీసీఎస్ అక్టోబర్ 10వ తేదీ లోపు స్పందించాలని గడువు విధించారు.
ఐటీ రంగంపై కొత్త దృష్టి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు వలస విధానాలు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై కఠినంగా వ్యవహరిస్తున్న వేళ ఈ సెనేటర్ల చర్య మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ ఐటీ కంపెనీలపై, వాటి నియామక విధానాలపై దీని ద్వారా కొత్త దృష్టి పడనుంది. టీసీఎస్ వంటి సంస్థలు తమ నియామకాల్లో మరింత పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై టీసీఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.